Congress alleges KTR met Lokesh: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ఏపీ ప్రభుత్వ తలబెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో ఒక్కసారిగా టీజీ పాలిటిక్స్ హీటెక్కాయి. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది. దీని వల్ల తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూట్ మార్చింది.
తెలంగాణకు నీటి వాటాల విషయంలో కేసీఆర్‌నే అన్యాయం చేశారని కౌంటర్ ఎటాక్ చేస్తోంది. ఏపీ సీఎంగా జగన్ ఉన్న సమయంలో కేసీఆర్ రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని చెప్పిన సంగతిని గుర్తుచేస్తున్నారు. అదే విధంగా బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకమంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా అఖిలపక్ష ఎంపీలతో సమావేశం కూడా నిర్వహించారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రిని కూడా కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు. దీంతో కేంద్రం నిపుణులు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏపీకి వెళ్లి బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులను నిరాకరించింది. దీంతో తమ వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందంటూ రెండు పార్టీలు క్రెడిట్ పొందేందుకు పోటీ పడుతున్నాయి.
ఈ క్రమంలోనే టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్య మంతనాలు జరుపుతున్నారంటూ బాంబ్ పేల్చారు. గోదావరి, కృష్ నదుల్లో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే.. కేటీఆర్ మాత్రం పక్క రాష్ట్ర మంత్రి లోకేశ్‌తో చీకటి సమావేశాలు జరిపారని ఆరోపించారు.
ఈ రహస్య మంతనాలు ఎవరికి లబ్ది చేసేందుకే కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రహస్యంగా సమావేశాలు జరుపుతూ తెర వెనక తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరి సామ ఆరోపణలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


