బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా కవిత లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల వ్యవహారం గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా ఉందని విమర్శించారు. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్‌ను ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే.. రాజకీయం అన్నారని.. ఇప్పుడు అదే విషయంలో కేసీఆర్‌ను కన్న కూతురురే అడుగుతుంది ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. కవిత రాసిన లేఖపై కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాపాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని జోస్యం చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై కేసీఆర్ మౌనంగా ఉన్నారని కవిత తన లేఖలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పదేండ్లు దోచుకున్న సంపదలో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ మొదలైందని ఆరోపించారు.
సొంత తండ్రిని నేరుగా కలవకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిలదీశారు. “మీకు ఫాంహౌస్‌లోకి ప్రవేశం లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. లేఖ లీక్ కావడంపై కేసీఆర్‌ను వివరణ కోరతారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఇంత జరుగుతున్నా మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలవడం లేదన్నారు.