Darshanam Mogulaiah Met KTR: వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కంటిచూపు సమస్య, ఇంటి స్థలం సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మొగులయ్య.. ఈరోజు కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన గోడు వెల్లబోసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/minister-ponnam-prabhakar-comments-on-bc-reservation-issue/
ఈ సందర్భంగా మొగులయ్య కొంతకాలంగా తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నట్లు కేటీఆర్‌కు తన సమస్యను విన్నవించారు. స్పందించిన కేటీఆర్.. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మొగులయ్యకు పూర్తిస్థాయి వైద్యం అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హానీ ఇచ్చారు. అనంతరం, కేసీఆర్ హయాంలో తనకు హయత్‌నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయం లిటిగేషన్‌లో ఉందని మొగులయ్య చెప్పారు.
హయత్‌నగర్‌లో స్థలం విషయంలో కొందరు వ్యక్తులు తనకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేటీఆర్‌తో మొగులయ్య చెప్పుకొచ్చారు. వారు కోర్టు కేసులతో వేధిస్తున్నారని, తాను నిర్మించుకున్న చిన్న గదిని సైతం కూల్చివేశారని వాపోయారు. ఈ విషయంపై తక్షణమే స్పందించిన కేటీఆర్, అక్కడికక్కడే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి సమస్య గురించి తెలిపారు. మొగులయ్యకు కేటాయించిన భూమి విషయంలో న్యాయం చేయాలని, ఆయనకు, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాకుండా న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా పార్టీ తరఫున సహాయం అందిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/aditya-political-debut-and-kavithas-new-political-strategy/
భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్‌లో పల్లవి పాడి.. మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయమయ్యారు దర్శనం మొగులయ్య. అప్పటివరకూ ఆయన గురించి ఎవరికీ తెలీదు. కాగా, గతంలో అడవి బిడ్డగా కిన్నెర వాయించుకునే తనను గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేసింది నాటి ముఖ్యమంత్రి కేసీఆరే అని మొగులయ్య ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే తనకు పద్మశ్రీ పురస్కారం దక్కిందని చెప్పారు. కేసీఆర్ మేలును ఎప్పటికీ మరువలేనని భావోద్వేగానికి గురయ్యారు.


