ఎవరేమి చేసినా, ప్రతిపక్షాలు తలకిందులుగా పొర్లుదండాలు పెట్టినా, రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బిఆర్ ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలు సుఖ శాంతులతో ప్రశాంతంగా జీవించాలంటే, కెసిఆర్ సీఎం కావాల్సిందేనని ఆయన అన్నారు. ఆ భగవంతుడి చల్లని చూపు, కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ ఎస్ అభ్యర్థులను కెసిఆర్ ప్రకటించిన తర్వాత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఇలవేల్పు, ఇష్టదైవం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించిన సీఎం కెసిఆర్, ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సీఎం కెసిఆర్, బిఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరుని ప్రజలు మెచ్చారని, ఇంత జనరంజకంగా, ప్రజోపయోగంగా పరిపాలన చేసిన సీఎంలు గతంలో రాలేదన్నారు. సీఎం కెసిఆర్ సీఎం కావాలని, బిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మళ్ళీ రావాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించాలని తాను కోరకున్నట్లు తెలిపారు. లక్ష్మీనర్సింహ స్వామి దీవెనలు అందరిపైనా ఉంటాయని, మహిమాన్వితమైన దేవాలయానికి మెరుగులు దిద్ది, న భూతో, న భవిష్యతి అన్న చందంగా అభివృద్ధి చేసిన సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం, పార్టీ, ప్రభుత్వంపై దేవుడి దీవెనలుంటాయన్నారు.