తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించవద్దని యధాతధంగా పేరును కొనసాగించాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పుల్లఖండం వేణుగోపాల్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఇచ్చిన పిలుపు మేరకు గార్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల గుండా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి, తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని తాసిల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమర నిరాహార దీక్ష చేపట్టి ఆత్మబలిదానం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదని దేశం గర్వించదగ్గ మహానాయకుడన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడేకాక స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని మహాత్మాగాంధీ నుంచి ప్రశంసలు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు ఈ తీరును ఆర్యవైశ్యులతో పాటు తెలుగు భాషాభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గార్ల ఆర్యవైశ్య మండల కార్యదర్శి పుల్లఖండం కనకశేకరం కోశాధికారి కొదుమూరి రాకేష్ పుల్ల ఖండం రమేష్ బాబు వేమిశెట్టి శ్రీనివాస్ చార్ల గుండ్ల రవికుమార్ బోనగిరి సుదర్శన్ రావు కలకోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.