ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైనదని, ఉన్నతమైనదని, ఉపాధ్యాయుల వైఖరి, ప్రవర్తన, ఆదర్శాలు సమాజానికి మార్గనిర్దేశనం చేస్తాయని, ఉపాధ్యాయులు విలువలకు ప్రాధాన్యమిచ్చి పిల్లలకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యాబుద్ధులు నేర్పించి వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఉపాధ్యాయులుగా జీవితాన్ని ఆరంభించి, ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంసలు అందుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్, ద్రౌపది ముర్ము వంటి వారు ఉపాధ్యాయ వర్గానికి ప్రతిరూపాలు, ఆదర్శమూర్తులని విశ్రాంత ఉపాధ్యాయులు వజ్రం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలోని రోగులకు ఆయన పండ్లను పంపిణీ చేశారు.
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడని నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి వుంటాడని కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలోనేనని విద్యనభ్యసించినప్పుడే..! ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడన్నారు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువు వద్ద గడుపుతాడని, అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ గురువు శిష్యులలో జ్ఞాన నిర్మాణం కావించి వారిలోని అజ్ఞానాన్ని తొలగిస్తాడన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ శాంతి కుమార్ ఈశ్వర్ లింగం వైద్య సిబ్బంది రమా తదితరులు ఉన్నారు.