Free medical services at GGH : ‘సర్కారు దవాఖానాకా? అమ్మో.. అక్కడికి పోతే మన పని అంతే’ అనే రోజులు పోయాయి. ‘అక్కడికి వెళ్తేనే మన జబ్బు నయమవుతుంది’ అని ప్రజలు చెప్పుకునేలా తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయాయి. దీనికి నిలువుటద్దంలా నిలుస్తోంది మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్). ఒకప్పుడు చిన్న జబ్బు చేస్తేనే హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గుండె జబ్బుల నుంచి ఎముకల సమస్యల వరకు.. దాదాపు అన్ని రకాల రోగాలకు ఇక్కడే పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోంది. మరి, ఆ ఆసుపత్రిలో ఉచితంగా లభించే సేవలపై సరైన అవగాహన లేక ఎందరో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల మెట్లెక్కి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అసలు జీజీహెచ్‌లో ఎలాంటి సేవలు ఉచితంగా అందిస్తున్నారు…? వాటిని ఎలా పొందాలి..?
అందని ద్రాక్షలాంటి వైద్యం.. ఇప్పుడు అందరి అరచేతిలో :మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉమ్మడి జిల్లా ప్రజలకు ఒక వరంలా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్యం చేరువైంది. ఇక్కడ అందిస్తున్న ఉచిత సేవల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉచిత ECG సౌకర్యం: గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు అత్యంత ముఖ్యమైన పరీక్ష అయిన ఈసీజీ (ECG) ఇక్కడ మీకు ఉచితంగా లభిస్తుంది. ఛాతిలో నొప్పి, గుండె దడ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పరీక్ష చేస్తారు. ప్రైవేటులో దీనికి రూ. 200 నుంచి రూ. 400 వరకు వసూలు చేస్తున్నారు.
డిజిటల్ ఎక్స్‌రే: ఎముకల పగుళ్లు, శరీరంలోని కణుతులను గుర్తించేందుకు ఉపయోగపడే డిజిటల్ ఎక్స్‌రే సేవలు కూడా ఇక్కడ ఉచితంగానే అందిస్తున్నారు. ఇదే పరీక్షకు బయట రూ. 500 నుంచి రూ. 1500 వరకు ఖర్చు అవుతుంది.
సాధారణ ఎక్స్‌రేలు: ప్రమాదాల్లో ఎముకలు విరిగినప్పుడు చేసే సాధారణ ఎక్స్‌రేలు కూడా ఇక్కడ ఉచితమే. ప్రైవేటులో దీనికి కనీసం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
రక్త పరీక్షలు: మధుమేహం (షుగర్), సీబీపీ, హెచ్‌ఐవీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, కాలేయ పనితీరు, డెంగీ వంటి అన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నింటికీ ప్రైవేటు ల్యాబ్‌లలో రూ. 2000 వరకు ఖర్చవుతుంది.
సీటీ స్కాన్ (CT Scan): శరీరంలోని అంతర్గత అవయవాలను స్పష్టంగా చూసి, వ్యాధి నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడే సీటీ స్కాన్ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. రూ. 1.50 కోట్ల విలువైన ఈ యంత్రం ద్వారా రోజుకు 50 నుంచి 60 మందికి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ కేవలం రూ. 500 నామమాత్రపు ఫీజుతో ఈ పరీక్ష చేస్తుండగా, ప్రైవేటులో దీనికి రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు వసూలు చేస్తున్నారు.
2డీ ఇకో (2D Echo): గుండె కవాటాల సమస్యలు, రక్త ప్రసరణలో అడ్డంకులు వంటివాటిని గుర్తించే 2డీ ఇకో పరీక్ష కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రైవేటులో ఈ పరీక్షకు రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకు అవుతుంది.
ఇతర వైద్య సేవలు: పైన చెప్పినవే కాకుండా జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, అనస్థీషియాలజీ, రేడియాలజీ వంటి అనేక స్పెషాలిటీ విభాగాల్లో నిపుణులైన వైద్యులచే ఉచితంగా సేవలు అందిస్తున్నారు.


