Saturday, November 16, 2024
HomeతెలంగాణPonnam Prabhakar | గీత కార్మికులకు గుడ్ న్యూస్

Ponnam Prabhakar | గీత కార్మికులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్షక కవచాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం… వారికి మరో తీపి కబురు అందించింది. గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు కూడా ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. శనివారం ఆయన హుస్నాబాద్ లో నిర్వహించిన గీత కార్మికులు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలను మంత్రి పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ… తాటి చెట్టు ఎక్కడం, దిగడం గీత కార్మికులకు ప్రాణాలతో చెలగాటం అని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు గీస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయిన అనేక దురదృష్ట సంఘటనలు ఇప్పటివరకు ఎన్నో జరిగాయి అన్నారు. అలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఐఐటి విద్యార్థులు రక్షక కవచాన్ని తయారు చేశారని చెప్పారు. దాని గురించి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి వాటిని కాటమయ్య రక్షక కవచం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు పంపిణీ చేస్తోందని అన్నారు.

గీత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూనే… పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని మంత్రి సూచించారు. తాటి చెట్లు ఎత్తు తక్కువ ఉండేలా కూడా సైంటిఫిక్ రీసెర్చ్ లు జరుగుతున్నాయని తెలిపారు. స్థలం ఉంటే బోర్లు వేసి తాటి, ఈత చెట్లను నాటి కాపాడుకోవాలని అన్నారు. బోర్ వేసే ప్రతిపాదన ఇవ్వండి వెంటనే వేయిస్తామని తెలిపారు. పాత బకాయిలు విడుదల అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు. త్వరలో మిగిలిన వారికి కూడా కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

కాగా, ఉదయం, సాయంత్రం తాటి, ఈత వనాలకు వెళ్లి వచ్చేందుకు తాము ఇబ్బందులు పడుతున్నామంటూ ఓ గీత కార్మికుడు మంత్రితో విన్నవించుకున్నాడు. దీనిపై స్పందించిన పొన్నం ప్రభాకర్… ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదని, 2025 మార్చినాటికి గీత కార్మికులకు మోపెడ్ వాహనాలను అందిస్తామని కీలక హామీ ఇచ్చారు. గీత కార్మికులు ప్రభుత్వం ఇచ్చే ఫలాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని తమ ప్రాణాలను రక్షించుకొని మెరుగైన జీవితాన్ని గడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News