గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు, జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండలం ఖాజిపల్లి గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు నేడు ప్రగతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి ద్వారా కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు నిర్మిస్తూ, ఇంటింటికి రక్షిత మంచినీరు అందించడంతోపాటు నర్సరీలు అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా పచ్చదనం పెంపొందిస్తున్నామని తెలిపారు.
జివిఆర్ ఎంటర్ప్రైజెస్ తో పాటు వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 15 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గద్దె నరసింహ, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, వివిధ విభాగాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.