తెలంగాణ అసెంబ్లీ(TG Assembly) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. ప్రభుత్వ బడ్జెట్ అంచనాలు పూర్తిగా అవాస్తవికంగా ఉన్నాయని చెప్పార. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.22 లక్షల కోట్లు మాత్రమేనని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రం దివాళా తీసిందని బహిరంగ వేదికలపై పదేపదే చెప్పడం సరికాదని విమర్శించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ (LRS) వద్దని ఆర్భాటం చేసిందని.. అధికారంలోకి రాగానే LRS పేరిట ప్రజల ముక్కు పిండి పైకం వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గచ్చిబౌలిలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో హరీశ్ రావు విమర్శలకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి శూన్యమని.. అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌ను రూ.7,300 కోట్లకు ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో మద్యం దుకాణాల గడువుకు 3 నెలల ముందే దరఖాస్తులు తీసుకుని నిరుద్యోగుల వద్ద నాన్ రిఫండబుల్ ఫండ్ కింద రూ.2వేల కోట్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు గురించి హరీశ్ రావు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని అన్నారు. కోకాపేట భూములు వేలం వేసిన చరిత్ర ఎవరిదని కోమటిరెడ్డి నిలదీశారు.