Rains in telangana today: తెలంగాణలో గత కొన్ని రోజులుగా తగ్గిన వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నిన్నటి వాతావరణం:
నిన్న మంగళవారం తెలంగాణలో వాతావరణమంతా చల్లగా మారిపోయింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే, ఇటీవల కాలంలో వర్షాలు తగ్గడం వల్ల రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వర్షపాత లోటు నమోదైంది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లోనూ లోటు కొనసాగుతోంది. వర్షాలు లేకపోవడంతో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
అయినప్పటికీ, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


