మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పదేండ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. డా.బీ ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో, డాక్యుమెంటరీ ఏజెన్సీ సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే 21 రోజుల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంగన్ వాడీలు, మహిళా సమాఖ్యల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని మహిళా సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి, పురోగతి జరుగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా రాణిస్తున్నారని అన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ టీమ్, సఖి, భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసామని పేర్కొన్నారు. అంగన్వాడిల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, దశాబ్ది ఉత్సవాలలో గ్రామీణ స్థాయి నుండి ఈ అంశాలను ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. త్వరితగతిన డాక్యుమెంటరీ పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధికి సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీ కెరీ, డాక్యుమెంటరీ ఏజెన్సీ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.