Sunday, November 16, 2025
HomeతెలంగాణHyderabad Metro Misery: ఆధునిక ప్రయాణం.. 'మెట్రో'లోనూ తప్పని వాన గండం!

Hyderabad Metro Misery: ఆధునిక ప్రయాణం.. ‘మెట్రో’లోనూ తప్పని వాన గండం!

Hyderabad Metro commuter woes : భాగ్యనగరంలో భారీ వర్షం పడిందంటే చాలు.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి, ట్రాఫిక్ నరకాన్ని చూపిస్తాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కించే ఏకైక మార్గంగా నగరవాసులు ‘హైదరాబాద్ మెట్రో’ను ఆశ్రయిస్తున్నారు. కానీ, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.. అక్కడికి వెళ్తే మరో రకం అవస్థలు వారిని స్వాగతిస్తున్నాయి. ప్లాట్‌ఫాంలపై నిలిచిన నీరు, కారుతున్న పైకప్పులతో స్టేషన్లలోనే తడవాల్సిన దుస్థితి నెలకొంది. 

- Advertisement -

వర్షం నుంచి రక్షణ కోరి మెట్రో ఎక్కితే, అక్కడా వరుణుడి ప్రతాపం నుంచి తప్పించుకోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. నిర్మాణం నుంచి నిర్వహణ వరకు పలు లోపాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

నిర్మాణంలోనే లోపమా  :  మెట్రో స్టేషన్లను పర్యావరణ హితంగా, తక్కువ విద్యుత్ వినియోగించేలా నిర్మించారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఓపెన్ డిజైన్‌ను ఎంచుకున్నారు. ఇదే ఇప్పుడు వర్షాకాలంలో ప్రయాణికులకు శాపంగా మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడినప్పుడు, వాన చినుకులు నేరుగా ప్లాట్‌ఫాంలపై పడి ప్రయాణికులను తడిపేస్తున్నాయి. దీనికి తోడు, చాలా స్టేషన్లలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్లాట్‌ఫాంపైనే వాన నీరు నిలిచిపోతోంది. సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తున్నా, జలగండం మాత్రం తప్పడం లేదు. ఈ నీటిలో జారిపడిన సందర్భాలూ ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.

కారుతున్న పైకప్పులు.. కాన్​కోర్స్‌లోనే నిర్బంధం : మెట్రో స్టేషన్లు నిర్మించి దాదాపు పదేళ్లు కావస్తోంది. దీంతో నిర్వహణ లోపాలు బయటపడుతున్నాయి. తార్నాక, అమీర్‌పేట, ఎల్బీనగర్, రాయదుర్గం వంటి అత్యంత రద్దీ స్టేషన్లలో సైతం కాన్​కోర్స్ (టికెట్ కౌంటర్లు ఉండే ప్రదేశం) స్థాయిలోనే పైకప్పుల నుంచి నీరు కారుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వర్షం పడితే ప్లాట్‌ఫాంపై నీరు చేరి నిలబడటానికి కూడా చోటు ఉండటం లేదు. దీంతో, తొక్కిసలాట జరగకుండా భద్రతా సిబ్బంది ప్రయాణికులను కాన్​కోర్స్‌లోనే నిలిపివేస్తున్నారు. ఫలితంగా, అక్కడా గాలి, వానకు తడవాల్సిన పరిస్థితి నెలకొంది.

పార్కింగ్‌లోనూ అదే తంతు : మియాపూర్, నాగోల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో మెట్రో సంస్థ పార్కింగ్ సదుపాయం కల్పించినా, వాటి నిర్వహణను థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించింది. ఈ పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలకు కనీస రక్షణ కరువైంది. పైకప్పులు లేకపోవడంతో తమ వాహనాలు “ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ” పాడైపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైళ్ల కోసం నిరీక్షణ : వర్షాకాలంలో మెట్రోకు ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. నాలుగైదు నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నా, అది ఏమాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు అంటున్నారు. ముఖ్యంగా రాయదుర్గం వంటి అత్యంత రద్దీ మార్గాల్లో వర్షం పడినప్పుడు రైలు కోసం 12 నిమిషాలకు పైగా వేచి చూడాల్సి వస్తోందని, ఇది ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతోందని వాపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad