లండన్ లోని ప్రిస్టన్ నగరంలో తెలంగాణ యువతికి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. తమ కుమార్తె చికిత్సకి అయ్యే ఖర్చు కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించాలని ఆమె కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
దిల్ సుఖ్ నగర్ లోని మారుతీ నగర్ కి చెందిన హిమ బిందు (Hima Bindu) కొన్ని నెలల క్రితం ఉద్యోగం కోసం లండన్ వెళ్ళింది. ప్రిస్టన్ నగరంలో బ్రోక్ హెవన్ అనే హాస్పిటల్ లో కేర్ టేకర్ గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూలానే వాకింగ్ చేసేందుకు గత నెల 24న బయటకి వెళ్లిన హిమబిందు.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఆమెని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవర్ డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్(వీడియో)
కాగా, రోడ్డు ప్రమాదం (Road Accident) లో తీవ్ర గాయాలపాలైన హిమబిందు కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లండన్ లో స్నేహితులు హిమబిందు తల్లి రమణమ్మకి సమాచారం ఇచ్చారు. కూతురికి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి దీనంగా ఉందని, కూతురి వద్దకి వెళ్లేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని రమణమ్మ విజ్ఞప్తి చేస్తున్నారు.