2024 ఫిబ్రవరి మాసంలో జరుగునున్న శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా విజయవంతం చేయాలని, వచ్చే నెలలో జరగనున్న దసరా పండుగ అనంతరం మేడారంలో అభివృద్ధి ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, గృహ నిర్మాణం, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుంభమేళా తరహాలో దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్పర్సన్ బడి నాగజ్యోతి, రెడ్ కో చైర్మన్ ఏరువా సతీష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్ కలసి ములుగు, మేడారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.మేడారం చేరుకున్న మంత్రులకు గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికి అమ్మవార్ల తీర్థప్రసాదనం అందజేశారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి తన ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకున్నారు. మేడారంలోని సమావేశపు హాల్లో రానున్న మేడారం జాతరను విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా జిల్లాలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం హర్షనీయమని, రాష్ట్రంలో ఎక్కడ పనిని వర్షం ములుగు జిల్లాల్లో కురిసింది అని అన్నారు. 2014 సంవత్సరం అనంతరం మేడారంలో జరిగే మహా జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరిగిన నాలుగు జాతర్ల సందర్భంగా 350 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. రానున్న జాతర సందర్భంగా అభివృద్ధి పనులు చేయడానికి వివిధ శాఖల అధికారులు ఇప్పటికే అంచనాలు తయారు చేసే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగిందని, ఈ జాతరకు 75 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉందని అన్నారు. మంజూరైన నిధులతో దసరా పండుగ అనంతరం చేపట్టే పనులకు గాను టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి పని స్పష్టంగా ఉండే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులే కాకుండా అవసరమైన పక్షంలో అదనపు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం 14 కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.
మేడారంలో రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను వర్చువల్ ద్వారా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకుపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఐదు నెలల ముందుగానే అధికారులతో సమీక్ష సమావేశాలు ప్రారంభించడం జరిగిందని, నిత్యం అధికారులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. జాతరలో మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య రాకుండా చూడడమే కాకుండా నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జాతర విజయవంతానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.