Rain Forecast for telugu states: అక్టోబర్ 1న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి అదే ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనంగా మారే అవకాశం ఉంది. ఇది తరువాత ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాల తిరోగమనం: జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది . నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయిందని అన్నారు. వచ్చే నెల రెండో వారం చివరి నాటికి భారత భూభాగం నుంచి రుతుపవనాలు పూర్తిగా తిరోగమిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాధారణం కంటే అధికంగా వర్షాలు : ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సగటున 74.5 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈ సీజన్‌లో 98.48 సెం.మీ వర్షపాతం నమోదైందని అన్నారు. ఇది సాధారణ వర్షపాతం కంటే దాదాపు 35% ఎక్కువ అని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో కురిసే వర్షాలతో సీజన్ మొత్తం వర్షపాతం 100 సెం.మీ దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అన్నారు. మండలాల వారీగా చూస్తే 147 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 291 మండలాల్లో అధిక వర్షపాతం, 181 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం రెండు మండలాల్లో మాత్రమే లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.


