తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(Inter exams) నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్ మెుదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా, సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం నుంచి జరుగుతాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. మెుదటి ఏడాది విద్యార్థులు 4,88,448 మంది, సెకండ్ ఇయర్ 5 లక్షల 8వేల 523 మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1532 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు.
ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఆయా సెంటర్ల వద్దకు చేరుకున్నారు. పరీక్షకు పదిహేను నిమిషాల ముందే వచ్చి చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లోకి మెుబైల్స్, స్మార్ట్ వాచ్ లు, మరే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి కాపీయింగ్ కి పాల్పడిన చర్యలు తప్పవని ముందుగానే హెచ్చరించారు.