Keleshwaram Project Probe: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా… సెప్టెంబర్ 1న జీవో నెంబర్ 104ను విడుదల చేసింది.
జీవోలో ఏముందంటే…కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద గోదావరి నది జలాలను వినియోగించుకునేందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. అక్టోబర్ 1, 2023న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఆరు పిల్లర్లు కుంగిపోయాయి. పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలు గుర్తించేందుకు, విచారణ జరిపేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కమిటీని నియమించింది. కమిటీ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి విచారణ చేపట్టింది. 2023 నవంబర్ 1న ప్రభుత్వానికి మద్యంతర రిపోర్టు, 2024 ఏప్రిల్ 24న తుది నివేదికను సమర్పించింది.
అయితే డిజైన్, ప్లానింగ్, నాణ్యతా, నిర్మాణాల లోపాల కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) తేల్చింది. దీంతో ప్రభుత్వం నిజనిజాల నిగ్గు తేల్చేందుకు మార్చి 14, 2024న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌ను అపాయింట్ చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపైనా ఘోష్ కమిషన్ దృష్టి సారించింది.
వివిధ కోణాల్లో విచారణ జరిపిన అనంతరం జూలై 31, 2025న ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం, దురుద్దేశం, వాస్తవాలను కప్పిపుచ్చేలా డిజైనింగ్, ప్లానింగ్, నిర్మాణం, నిధుల దుర్వినియోగం జరిగిందని.. ఇది నేరపూరిత చర్య అని నివేదికలో పొందుపరిచారు. ‘ఈ మూడు బ్యారేజీల నిర్మాణం అనాలోచిత చర్య, ఎలాంటి ప్రణాళిక లేని ప్రయత్నం’ అని నివేదిక అభిప్రాయపడింది.
2025 ఆగస్టు 4న కమిషన్ రిపోర్టును మంత్రివర్గం చర్చించి.. ఆగస్టు 31న శాసనసభలో ప్రవేశపెట్టాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) తోపాటు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించాం. ఆ నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీల ప్రమేయం ఉందని గుర్తించాం. కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచ పలు ఏజెన్సీలు డిజైనింగ్, నిర్వహణలో భాగస్వామ్యం పంచుకున్నందున సీబీఐ దర్యాప్తు చేయడం సరైన చర్యగా ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) , జస్టిస్ పీజీ ఘోష్ కమిషన్‌ల నివేదికల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ప్రజాధనం వృథా అయ్యింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని శాసనసభ తీర్మానించింది.
రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ అప్పటి ప్రభుత్వం 2022 ఆగస్టు 30న జీవో 51 విడుదల చేసింది. ఆ జీవోకు సడలింపునిస్తూ ఈ కేసులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, వ్యక్తులు ఎవరైనా వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది.


