Kalvakuntla Kavitha Comments on Group1 : గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బుధవారం గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దని చెప్పారు. అభ్యర్థులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని, వారి నోట్లో మట్టి కొట్టొదన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసి తిరిగి పరీక నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు నిరుద్యోగుల ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. గ్రూప్-1 పరీక్షల వ్యవహారంపై న్యాయస్థానాల్లో న్యాయమూర్తులకు అర్థమయ్యే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. గ్రూప్-1 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదన్నారు. అధికారంలోకి వచ్చాక పాత ఉద్యోగాలనే భర్తీ చేశారని ఎద్దేవా చేశారు. గ్రూప్-1 అంశంపై మేధావులు, ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించాలని, విద్యార్థులు ఆయనను నమ్మారని, వారి పక్షాన నిలబడాలని సూచించారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సంచలన వ్యాఖ్యులు చేశారు.
గ్రూప్–1 రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టివేత..
కాగా, గ్రూప్–1 సర్వీసుల నియామకాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. గ్రూప్1 రద్దు కోరుతూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రధాన అప్పీళ్లు హైకోర్టులో ఈ నెల 15న విచారణకు రానున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఆయా పోస్టుల్లో నియమితులైన వారికి ఎలాంటి సమానత్వ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జొయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. గ్రూప్ 1 అంశంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టుకు సూచించింది.


