Sunday, December 8, 2024
HomeతెలంగాణKarimnagar: స్కైలాబ్ కు 45 ఏళ్లు

Karimnagar: స్కైలాబ్ కు 45 ఏళ్లు

పునర్జన్మ లభించిందని సంబరాలు చేసుకున్న రోజు

సరిగ్గా 45 ఏళ్ల క్రితం జులై మాసంలో స్కైలాబ్ అనే ఉపగ్రహం గతి తప్పడంతో అది కూలిపోనుందని దీని ప్రభావం జిల్లాపైనా పడనుందని అప్పుడు రేడియోలు, వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఉన్నన్ని రోజులు సంతోషంగా గడుపుదామని విందులు, వినోదాలు చేసుకున్నారు. అందరం కలిసి ఒకేసారి చనిపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. విలువైన సామగ్రిని బావులు, గోతులు, ఇళ్ల గోడల్లో భద్రపరుచుకున్నారు. మరొకొందరు తక్కువ ధరలకే విక్రయించి జల్సా చేశారు.

- Advertisement -

ఎట్టకేలకు 1979 జూలై 11న స్కైలాబ్ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సముద్రంలో కూల్చివేయడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. గండం గడిచిందని వార్తలు రావడంతో ప్రజలంతా మళ్లీ కొద్ది రోజులు విందులు, వినోదాలు చేసుకుని పునర్జన్మ పొందామని ఆనందపడ్డారు.
👉ఆరోజు జన్మించిన వారు స్కైలాబయ్యారు…
దేశ ప్రజలంతా ఉపగ్రహం కూలుతుందని గడగడ లాడిన రోజున పలువురు జన్మించడంతో వారందరికి స్కైలాబ్ అని నామకరణం చేశారు. భయాందోళనకు గురైన వారందరు పునర్జన్మ అనుకుంటున్న సమయంలో జన్మించిన వారిలో చాలా మందికి స్కైలాబ్ అని పేరు పెట్టారు. వీరు పుట్టిన రోజున బయట పడ్డామని తీపి గుర్తుగా పేరు పెట్టడంతో ఇప్పటికి చాలా గ్రామాల్లో స్కైలాబ్ అనే పేరుగల వారు అప్పుడప్పుడు తారస పడుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా పలువురు కొందరు పేరు చివర స్కైలాబ్ అని పెట్టుకున్నారు.
👉నా పేరులోనే ప్రత్యేకత ఉంది…
కందుల చరణ్ స్కైలాబ్ మంగళపల్లి…
ఊహ తెలిశాక నా పేరులో స్కైలాబ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. నేను పుట్టిన రోజున ప్రపంచమే ఊపిరి పీల్చుకుందని తెలివడంతో గర్వంగా అనిపించింది. మొదట్లో స్కైలాబ్ అని పిలిచే వారు. ఇప్పుడు నా పేరును చరణ్ స్కైలాబ్ గా మార్చుకున్నాను.

👉గుర్తుగా ఉంటుందని పేరుపెట్టా…
కందుల చంద్రమ్మ, మంగళపల్లి…
స్కైలాబ్ సముద్రంలో పడిపోయిన రోజున కొడుకు పుట్టాడు. గుర్తుగా ఉంటుందని స్కైలాబ్ అని పేరు పెట్టా. కొడుకు పుట్టక ముందు బాగ భయపెట్టిండ్రు. మావోడు పుట్టి అందరిని బతికిచ్చిండని సంబరపడ్డరు. స్కైలాబ్ సముద్రంలో పడి 45 సంవత్సరాలు అవుతున్న ఏడాదేడాది గుర్తస్తనే ఉంటది.


👉 ఆనాటి జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలే…
కాసగోని చేరలు వెంకట్రావుపల్లి…
ఆనాటి జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలే కళ్ళముందే మెదులుతున్నాయి. అప్పుడు నా వయసు సరిగ్గా 30 సంవత్సరాలు. స్కైలాబ్ పడుతుందని అందరం చనిపోతామని ప్రచారం జరగడంతో ఎక్కడెక్కడో ఉన్న బంధువులందరం ఒక చోట చేరాం. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపాలని విందులు, వినోదాలు చేసుకున్నాం. స్కైలాబ్ సముద్రంలో పడిందని తెలియగానే మాకు మరో పునర్జన్మ లభించిందని సంబరాలు చేసుకున్నాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News