హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్(KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పార్టీ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎనికల్లో ఓడిపోగానే కొంతమంది పార్టీ నేతలు నైరాశ్యం చెందారని.. పార్టీలో ఉంటూనే నెగెటివ్ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయిందని భావించక్కర్లేదన్నారు. అలా భావించిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని.. వారికి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఇక పార్టీలో యాక్టివ్‌గా లేని నేతలకు క్లాస్ పీకారు. ఇకపై అందరూ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఇందుకు పార్టీ నేతలు, శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఇంత త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనుకోలేదని అన్నారు.


కాగా ఈ సమావేశంలో రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై వివరించారు. తెలంగాణ ఉద్యమం, అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని ప్రస్తావించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇక అక్టోబర్, నవంబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

