పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించుకుంటున్న బి.ఆర్.ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపిన కేటీఆర్, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.
ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్ధలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. 25వ తేదీన రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరగుతుందని, ఈ సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500 -3000 మంది ప్రతినిధులతో నిర్వహించుటామన్న కెటియార్, నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డ్ పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, జడ్పీ చైర్మన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు హజరుఅవుతారన్నారు.
వీరందరిని ఈ సమావేశాలకు హాజరయ్యేటట్లు సమన్వయం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలను కేసిఆర్ గారు ఆదేశించినట్లు తెలిపారు.సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులను బాగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ యంఏల్యేలు, ఇంచార్జీలకు కేటీఅర్ సూచన చేశారు.
ఏప్రిల్ 27న హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ/విస్తృత స్థాయి సమావేశం బదులు అక్టోబర్ 10వ తేదీన భారత రాష్ట్ర సమితి వరంగల్ మహాసభ నిర్వహణ జరుగుతుందన్నారు.
మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పట్ల కెసిఆర్ గారు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఇవి మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు దాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని సూచించారు.