హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బలం లేదు కాబట్టే అభ్యర్థిని పోటీలో పెట్టలేదని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలతో సంబంధం లేదు కాబట్టి ఎవరికీ ఓటువేయవద్దని సూచించారు. ఆ రెండు పార్టీల నేతలు ఒకటే అన్నారు. ఎన్నికకు హాజరు కావద్దని పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు విప్ కూడా జారీ చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీని ఎదుర్కొని కేసీఆర్ (KCR) పార్టీ పెట్టారని.. ఆయన పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల పేరుతో అరాచకాలు చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలే రక్షణ కవచాలని ఆరోపించారు. 17 నెలల్లో తెలంగాణకు బీజేపీ ఎంపీలు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి కాంగ్రెస్, భారాస దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.