KTR: తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం విలాసవంతమైన ప్రాజెక్టుల సమీక్షల్లో మునిగిపోయారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
భారీ వర్షాల కారణంగా ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిందని, అనేక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వం నుండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజల కష్టాలు పట్టడం లేదని, ఆయన దృష్టి కేవలం లాభాలు తెచ్చిపెట్టే ప్రాజెక్టులపైన ఉందని ఆరోపించారు.
“ఒకవైపు ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు రూ.3.5 లక్షల కోట్లతో 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ.1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ, ఇంకా రూ.225 కోట్లతో హైదరాబాద్ బీచ్ వంటి భారీ ప్రాజెక్టుల గురించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు. ప్రజల బాధలను గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపై మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది” అని కేటీఆర్ తన ట్వీట్‌లో దుయ్యబట్టారు.


