Jubilee Hills campaign: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారంలో చేసిన ‘బెదిరింపు’ వ్యాఖ్యలకు భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఘాటుగా బదులిచ్చారు. రహమత్ నగర్ డివిజన్‌లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి రోడ్ షో నిర్వహించిన కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ కూలుతుందని హెచ్చరిక:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాల రద్దు గురించి ప్రస్తావించి ప్రజలను భయపెట్టాలని చూస్తే, ఇదే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారు అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఆయన చేస్తున్న రాజకీయ బెదిరింపులకు తెలంగాణ ప్రజలు ఏమాత్రం తలవంచరని స్పష్టం చేశారు. మీరు పథకాలు రద్దు చేస్తే, ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారు. కాంగ్రెస్ నేతలు ఎవరైనా ప్రజలను భయపెట్టాలని చూస్తే, తెలంగాణ భవన్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. వారి సంగతి మేము చూసుకుంటాం,” అని కేటీఆర్ ధీమాగా ప్రకటించారు.
BRS విజయం ఖాయం!
ఉపఎన్నికలో BRS విజయం ఖాయమైందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, గతం కంటే రెట్టింపు మెజార్టీతో మాగంటి సునీత గెలవబోతున్నారని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను గుర్తుచేసుకుంటూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, పేదలకు చెందిన స్థలాలను కాపాడటంలో ఆయన చేసిన కృషిని మరువలేమని కొనియాడారు. గోపీనాథ్ ఆశయాలను సునీత ముందుకు తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి తమపై చేస్తున్న కుమ్మక్కు రాజకీయాల ఆరోపణలను కేటీఆర్ తిప్పికొట్టారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌తో కేవలం ఫేక్ బంధం మాత్రమే ఉందని, కానీ బీజేపీతో పేగు బంధం ఉందని ఎద్దేవా చేశారు.
బుల్డోజర్ రాజకీయాలపై ఆగ్రహం:
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా (Hydra) పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పు మీద తప్పు చేస్తున్న రేవంత్ సర్కార్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉపఎన్నికలో గట్టి బుద్ధి చెప్పబోతున్నారు అని స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కొనసాగింపు కోసం మాగంటి సునీతను గెలిపించాలని ప్రజలను కోరారు.


