తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోలేదని ఎద్దేవా చేశారు. ‘ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తే ఊరుకుంటామా?, ఇంట్లో భార్య, బిడ్డను ఫొటోలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి డ్రోన్ పంపిస్తే ఊరుకుంటావా?.. అక్కడ నీ బిడ్డనో, భార్యనో ఉంటే వాళ్ళను ఇష్టం ఉన్నట్లు ఫోటో తీస్తే ఊరుకుంటావా?’ ప్రశ్నించారు.
గతంలో ‘నా మీద లేనిపోని రంకులు అంటగట్టారు. నా కుటుంబాన్ని నిందించారు. ఆ సమయంలో చిన్న పిల్లోడు అయిన నా కుమారుడ్ని కూడా ఇష్టానుసారం మాట్లాడారు. మీ ఇంట్లో వాళ్లే ఆడవాళ్లు.. మా ఇంట్లో వాళ్లు కారా? మీకే కుటుంబాలు ఉన్నాయా.. మాకు కుటుంబాలు లేవా..? రేవంత్ రెడ్డిని జైలుకు పంపింది ఆనాటి ప్రభుత్వం కాదని.. కోర్టులు పంపాయి. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగలరు అని ముఖ్యమంత్రి భయపెట్టాలని చూస్తున్నారు.. నువ్వు ఏం అనుకున్న ఫరక్ పడదు” కేటీఆర్ మండిపడ్డారు. కాగా అంతకుముందు అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారని తనను 16 రోజులు పాటు జైలులో బంధించి తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.