Weather Report: గత మూడు రోజులుగా హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు నిన్న మరింత ఉద్ధృతంగా కురిశాయి. అయితే ఈ రోజు మాత్రం వర్ష తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ఏపీ, తెలంగాణకు ఎలాంటి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేయనప్పటికీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ వాతావరణం: ఈ రోజు ఉదయం తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మేఘాలు పెద్దగా కనిపించవు. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత కర్ణాటక నుంచి వచ్చే మేఘాల ప్రభావంతో పశ్చిమ తెలంగాణలో వర్షాలు మొదలవుతాయి. ఈ వర్షాలు క్రమంగా హైదరాబాద్‌ను కమ్మేస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెల్లవారుజాము 3 గంటల వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు తెలంగాణలో మాత్రం వర్షపాతం కొంత తక్కువగా ఉండవచ్చు. ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోయినా.. మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ ప్రజలకు సూచన: వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉన్నందున హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పగటిపూట వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. సాయంత్రం తర్వాత వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోకుండా ఉండేందుకు సాయంత్రం లోపు ఇళ్లకు చేరుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఆంధ్రప్రదేశ్‌లోనూ పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. సాయంత్రం తర్వాత అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయని వెల్లడించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వర్షాలు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ రాయలసీమలో మాత్రం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో ఈ రోజు రోజంతా మేఘావృతమై ఉంటుంది. రాబోయే ఐదు రోజుల పాటు కోస్తాంధ్ర, యానాం రాయలసీమలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉష్ణోగ్రతలు, తేమ శాతం: ఈ రోజు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌గా, ఆంధ్రప్రదేశ్‌లో 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుంది. పగటిపూట తెలంగాణలో 60 శాతం, ఏపీలో 57 శాతం తేమ ఉంటుంది. రాత్రికి ఇది తెలంగాణలో 89 శాతం, ఏపీలో 88 శాతానికి పెరుగుతుంది. ఈ తేమ పెరుగుదల కారణంగానే రాత్రిపూట రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.


