Friday, November 22, 2024
HomeతెలంగాణManchiryala: సింగరేణి ప్రగతికి దర్పణంగా సంబురాలు

Manchiryala: సింగరేణి ప్రగతికి దర్పణంగా సంబురాలు

సింగరేణి ప్రగతికి దర్పణంగా సింగరేణి సంబురాలు అన్ని గనుల విభాగాల్లో ఘనంగా ఉత్సవాల నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు అధికారులు. సింగరేణి అన్ని ఏరియా స్థాయి ఉత్సవాలు, స్వరాష్ట్రంలో సింగరేణి ప్రగతిని వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్లు, బ్యానర్లు, అద్భుత ప్రగతి పుస్తకాల పంపిణీ అన్ని ఏరియాలో జీఎం లకు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారిచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా జూన్ 5వ తేదీన సింగరేణి సంబురాలను ఘనంగా నిర్వహించాలని సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ శనివారం రోజున ఆదేశించడం జరిగింది.
హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంస్థ డైరెక్టర్లు, ఏరియాల జనరల్ మేనేజర్ల తో శనివారం ఉదయం సమావేశం నిర్వహించి కార్యక్రమాల నిర్వహణపై అంశాల వారీగా వివరించి ఆదేశాలు జారీ చేశారు.
134 సంవత్సరాలు చరిత్రలో సింగరేణి సంస్థ ఎన్నడూ సాధించని వృద్ధిని నమోదు చేసిందని, ఉత్పత్తి, టర్నోవర్ , లాభాల్లో అద్భుత ప్రగతిని నమోదు చేసిందని పేర్కొంటూ ఈ విజయాలను కార్మికులకు, ప్రజలకు సింగరేణి సంబురాల్లో పలు మాధ్యమాల ద్వారా వివరించాలన్నారు. ప్రతి గనిలో మూడు షిఫ్టుల ప్రారంభంలో తెలంగాణ సంబురాలు నిర్వహించాలన్నారు. అమరవీరులకు నివాళులర్పించి కంపెనీ సాధించిన విజయాలపై వివరించాలని, అలాగే లఘు వీడియో చిత్రాన్ని ప్రదర్శించాలని, సంస్థ ప్రచురించిన “సింగరేణి అద్భుత ప్రగతి” పుస్తకాలను ప్రతి కార్మికుడికి అందజేయాలని ఆదేశించారు. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన కార్మికులు తమ అభిప్రాయాలను గని వేదికపై వెల్లడించేలా ఆహ్వానించాలని, కార్మికులందరికీ స్వీట్ బాక్సులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఏరియా స్థాయిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జూన్ 5వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏరియా స్థాయి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ఈ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ అధికారులు పాల్గొనేలా ఆహ్వానించాలన్నారు. ఉదయం పూట అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సింగరేణి స్టాల్స్ ను ప్రారంభించాలని, అనంతరం వేదికపై సింగరేణి సంస్థ సాధించిన అంశాలపై వీడియో చిత్రాన్ని ప్రదర్శించాలని, ఏరియా జనరల్ మేనేజర్ స్థానికంగా సింగరేణి సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారని తెలిపారు. సింగరేణి సంస్థ సమాజ హితం కోసం చేసిన పనులపై ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ప్రసంగిస్తారన్నారు.
ఇదే వేదిక పైన కారుణ్య ఉద్యోగాలు పొందిన వారికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేయాలని, కార్మికులకు పది లక్షల రుణం పై వడ్డీ చెల్లించే శాంక్షన్ లెటర్లు, చెక్కులు, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు అందజేత వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సంస్థ ప్రగతిని మరియు సమీప గ్రామాలకు చేసిన సేవలను వివరిస్తూ పట్టణ ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో సింగరేణి సంస్థ దేశంలో మరే ఇతర ప్రభుత్వ కంపెనీ సాధించని వృద్ధిని నమోదు చేసిందని, సంక్షేమంలో నెంబర్ వన్ గా ఉందని, ఈ వివరాలను దశాబ్ది ఉత్సవాలలో సగర్వంగా వివరించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్ (ఫైనాన్స్ మరియు పా) ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఈ & ఎం) డి.సత్యనారాయణ రావు, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం.సురేష్, కొత్తగూడెం కార్పొరేట్ నుండి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్.వి కె.శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) జి.వెంకటేశ్వరరెడ్డి, కార్పోరేట్ జీఎంలు, ఏరియా జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News