విశ్వనాథ సాహిత్య పీఠం ద్విశతాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ లో సాహిత్య సౌరభాలు వెల్లివిరిసాయి. అమీర్ పేటలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ సాహితీ వైభవాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహితీ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న కీర్తిశేషులు సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) వ్యక్తిత్వాన్ని ఆయన సోదరుడు చేంబోలు శ్రీరామశాస్త్రి హృద్యంగా అక్షర రూపం ఇచ్చారు. ఆయన రచించిన ‘పూర్ణత్వపు పొలిమేరలో…( సంక్షిప్తం)” పుస్తకాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ఆవిష్కరించారు.
Also Read : కానిస్టేబుల్ పరీక్ష తేదీలను ప్రకటించిన SSC
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) సోదరుడు శ్రీరామశాస్త్రి మనందరికన్నా ఆయన జీవితాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి. ఆయన రచించిన ఈ పుస్తకం ద్వారా సిరివెన్నెల స్ఫూర్తివంతమైన జీవితాన్ని సమాజానికి మరింత లోతుగా పరిచయం చేయడం గొప్ప విషయమని అన్నారు. సులభతరమైన సాహిత్యంతో పండిత పామరులను సైతం ఈ పుస్తకం ఆకట్టుకుంటుందని అన్నారు. ఆర్షధర్మాన్నీ, భారతీయతను, మంచితనాన్నీ, మనిషితనాన్నీ, మానవీయతను, విప్లవాత్మకతను.. తనదైన శైలిలో, పద సౌందర్యంతో చక్కటి పాటలు తన కలం నుండి జాలువారించి సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగువారి గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకొన్నారని ఎన్వీఎస్ రెడ్డి కొనియాడారు.
కోవిడ్ కాలంలో నాకు దొరికిన విశ్రాంతి సమయాన్ని వినియోగించుకొని నేను హైదరాబాద్ మెట్రో చరిత్రనంతా 58 కవితలుగా మాత్రాచ్ఛందస్సులో “మేఘపథం” అనే కావ్యంగా రాసినపుడు సీతారామశాస్త్రి దానికి ముందు మాట రాస్తానన్నారు. కానీ, అనారోగ్యం వల్ల రాయకుండానే వెళ్లిపోయారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయినా ఆయన అమరుడు, అమృతాన్ని కురిపించిన వాడు. ఆయన కురిపించిన అమృతాన్ని మనం దోసిళ్లతో తాగగల్గుతున్నామని ఆయన తెలిపారు.
విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ వెల్చాల కొండలరావు సమర్పణలో ముద్రితమైన ఈ చిరు పుస్తకం సిరివెన్నెల వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా తెలియపరచే మంచి పుస్తకం అని ఎన్వీఎస్ రెడ్డి అభివర్ణించారు.