Metro services extended: గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వాసులకు మెట్రో శుభవార్త తెలిపింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెల్పింది. నిమజ్జనం చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి: రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పని చేసినట్లు వెల్లడించారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి చెరువులను అన్నింటిని పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ విగ్రహాలకు అనుమతి తప్పనిసరి: ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీసుల సూచనల మేరకు మాత్రమే గణేశ్ నిమజ్జనం కోసం మండపాల నుంచి బయల్దేరాలని సూచించారు. విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకువెళ్లాలని అన్నారు. హైదరాబాద్‌లో ప్రతి ప్రాంతంపై మ్యాప్ వేసుకుని మార్గాలను నిర్ణయించామని పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
బారికేడ్లు ఏర్పాటు: రోడ్లపై డైవర్షన్ ఉన్నచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. 29 వేల మందితో పోలీసు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు. శనివారం సుమారు 50 వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని సీపీ సీవీ ఆనంద్ అంచనా వేశారు.
మహాగణపతికి సీఎం ప్రత్యేక పూజలు: ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. హారతి ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవిలో ఈ మహాగణేశుని పూజించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఒక చిన్న విగ్రహంతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవం ఈరోజు అంతటి మహత్తర స్థాయికి చేరిందని ఆయన గుర్తుచేశారు.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ: రేవంత్ రెడ్డి మాటల్లో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ వెనుకడుగు వేయదని, ప్రతిసారీ భక్తుల ఆత్మీయతతో ఈ వేడుకలు విజయవంతం అవుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఎంతమంది గణపతులు ప్రతిష్టించినా, ఖైరతాబాద్ మహాగణపతికి వచ్చే గౌరవం మాత్రం ప్రత్యేకమని ఆయన స్పష్టం చేశారు


