తెలంగాణ రాష్ట్రమంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మహేందర్ కు ఛాతినొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు సూరారంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెల్లవారు జాము నుండి మంత్రి తో ఆయన కొడుకులు, కూతురు, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందో. ఐటీదాడుల నేపథ్యంలో నిన్నంతా మహేందర్ రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు.
ఇదిలా ఉండగా.. తనకొడుకుని ఐటీ అధికారులు కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న మహేందర్ ను చూసేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడుల పేరుతో వేధించారని, అందుకే తన కొడుకు ఆస్పత్రిపాలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తామేమీ దొంగ వ్యాపారాలు చేయడం లేదని.. కాలేజీలను స్థాపించి సేవ చేస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నేడు ఈ స్థాయిలో ఉన్నామని.. నిజాయతీగా బతుకుతున్నామన్నారు.
రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా.. నిన్న అర్థరాత్రి వరకూ జరిపిన సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లతో పాటు.. రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈరోజు కూడా వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.