సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇవ్వాలనే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. మహిళలు భూ యాజమానులయ్యేలా ప్రొత్సహించేందుకు అనువుగా ఇది తోడ్పడుతుందని, మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు మహిళా రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని హమీ ఇవ్వటం విశేషం. భూమి అంటే ఆర్థిక వనరే కాదు సమాజంలో గౌరవం, అధికారమన్న సీతక్క, భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు.
సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీల్లో మహిళలకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క ఈ సందర్భంగా వెల్లడించటం హైలైట్.
సాగు భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేసారు. మహిళలను భూ యాజమానులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతక్కతో మహిళా రైతుల హక్కుల కోసం పనిచేసే ‘మహిళా కిసాన్ అధికార్ మంచ్’ (MAKAAM) ప్రతినిధులు Dr. ఉషా సీతా సీతా మహాలక్ష్మి, Dr. వి రుక్మిణి రావు, S. ఆశాలత తదితరులు సీతక్క అధికార నివాస గృహం ప్రజా భవన్ లో భేటీ అయ్యారు. మహిళలకు భూ యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి సీతక్క మాట్లాడుతు..‘మన దేశం పారిశ్రామిక రంగంలో ఎదిగినప్పటికీ ఇంకా వ్యవసాయ ఆధారిత దేశంగానే ఉంది. దేశ వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నా వారి చేతిలో భూములు పెద్దగా లేవు. తెలంగాణ వ్యవసాయంలో 50 శాతం మేర మహిళలకు భాగస్వామ్యం వున్నా.. వారి చేతిలో 22 శాతం భూములు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భూమి అనేది కేవలం ఆర్థిక వనరే కాదు. భూమి అంటే ఆత్మ గౌరవం, సమాజంలో హోదా. భూమి అంటే అధికారం. అంతటి ప్రాధాన్యత ఉన్న భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు.
అయితే పదేకరాల వరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో..కుటుంబ సభ్యుల మధ్య భూ పంపకాలు జరిగే అవకాశాలున్నాయని ‘మకాం’ ప్రతినిధులు మంత్రి సీతక్క కి వివరించారు. పెళ్లికాని కుమార్తెలు, ఒంటరి మహిళలు, గృహిణుల పేర్లపై భూ రిజిస్ట్రేషన్ల ను పెంచేలా.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళలకి రాయితీ ఇవ్వాలని, తద్వారా మహిళలకు ఆస్థి హక్కును అమలు చేసిన వారవుతారని అభిప్రాయపడ్డారు. దీంతో సీఎం, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి సాగు భూమి రిజిస్ట్రేషన్ల చార్జీలో 50 శాతం రాయితీలు ఇస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం, మహిళలకు భూ యజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. తమ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకి, మహిళా కిసాన్ అధికార్ మంచ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.