Sunday, July 7, 2024
HomeతెలంగాణMulugu: ములుగుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దాం

Mulugu: ములుగుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దాం

త్వరలో డిజిటల్ స్కూల్స్ కూడా

ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క )అన్నారు. ములుగు ఇంచర్ల గ్రామం లోని యం ఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , ఎస్పీ శభరిష్ , ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిశ్రాతో కలిసి మంత్రి నియోజక వర్గ అభివృద్ధి కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని, శాశ్వత అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చూడాలని, వేతనం కోసం పని చేయకుండా ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు కలకాలం అధికారులను గుర్తుపెట్టుకుంటారని తెలిపారు.

- Advertisement -

ఉద్యోగుల వద్దకు ప్రజలు తమ సమస్యలను తెలుపడానికి వచ్చే సమయం లో వారికి ఓపికతో సమాధానం చెప్పి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, ప్రజలకు సేవ చేస్తే ప్రజలు అధికారులనే దేవుళ్ళుగా కొలుస్తారని అన్నారు. గ్రామాలలో చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి ద్వారా స్థానిక యువతకు,మహిళలకు ఉపాధి కల్పించే విధంగా నూతన విధానాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. అటవీ అధికారులు అడవుల వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి జిల్లా అధికారులు తప్పని సరిగా గ్రామాలలో పర్యటన చేయాలని దాని ద్వారా గ్రామాల సమస్యలపై అధికారులకు సరైన అవగాహన కలుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని, సిసి రోడ్ల పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అన్నారు.


డి ఆర్ డి ఓ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందించాలని స్వయం సహాయక మహిళా సంఘాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో అధికంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ధరణి సూచనల ప్రకారం భూ సమస్యలకు పరిష్కారం చూపాలని , కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల నూతన భవన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రానున్న విద్య కాలం నాటికి నూతన భవనాలు విద్యార్థులకు అందుబాటులోకి రావాలని నూతన విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల ఆవరణలోనే అంగన్వాడి కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 40 పాఠశాలలలో డిజిటల్ తరగతులు ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విద్యార్థులు దేశానికి మానవ వనరులని పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మేడారం స్తూపం ప్రాంతంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ములుగు ఏరియా హాస్పిటల్ లో వైద్య సిబ్బంది కొరత ఉందని వాటికి సంబందించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గిరిజనులకు ఐటీడీఏలో అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, నూతన ఐటిడిఏ భవనం కొరకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. త్వరలోనే ఐటీడీఏ అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ శబరీష్ జిల్లాలో చేపడుతున్న పనుల గూర్చి వివరించారు.కార్యక్రమంలో ములుగు జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ , మహబూబాబాద్ అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు)లెనిన్ వాత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జి , ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిశేట్టి సంకీర్త్ , ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి ,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News