Telangana government New card distribution: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డు అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా రేపు (జూలై 14) ప్రారంభించనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం, అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 26నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 26 నుంచి మే 23 వరకు 2.03 లక్షల కొత్త కార్డులు జారీ చేయగా, మే 24 నుంచి జూలై వరకు మరో 3.58 లక్షల కార్డులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేశారు. మొత్తం ఇప్పటివరకు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు పెరిగిందని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది.
గతంలో రాష్ట్రంలో 55 లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఉండేవి. కానీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (NFSA) అమలులోకి వచ్చిన తర్వాత కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ సంఖ్య 89.95 లక్షలకు చేరింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా కార్డులు జారీ చేయడంతో పాటు, పాత కార్డుల్లో తగిన మార్పులు చేర్పులు చేస్తూ మళ్లీ పరిశీలన చేపట్టింది. తాజాగా రాష్ట్రంలో మొత్తం 3.09 కోట్ల మంది రేషన్ కార్డు పొందే అర్హత కలిగినవారిగా గుర్తించారు. ఈ కొత్త కార్డుల జారీతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆహార భద్రత మరింత బలపడనుంది. ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నిదర్శనంగా నిలుస్తోంది.
కాగా ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం భారీ మొత్తంలో ప్రణాళికలు రచించింది. పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అతిపెద్ద భారీ బహిరంగ సభను రేపు నిర్వహించనుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు. అలాగే ఈ సభ నుంచి అనేక మందికి సరికొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. తమ హామీల అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక అనేక వర్గాల నుంచి అనుకూల స్పందన లభిస్తోంది.


