Sunday, July 7, 2024
HomeతెలంగాణNiranjan Reddy: భారతావనిని నిర్మించటానికి పునరంకితం అవుదాం

Niranjan Reddy: భారతావనిని నిర్మించటానికి పునరంకితం అవుదాం

దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం సింహభాగంగా నిలబడింది

ఎందరో మహానుభావుల త్యాగనిరతి స్మరించుకుంటు వారు కలలు కన్న భారతావనిని నిర్మించటానికి అందరము పునరంకితం అవుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ప్రజలనుద్దేశించి తన ప్రసంగాన్ని చదివి వినిపించారు. స్వాతంత్య్రం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తుకై పంచవర్ష ప్రణాళికలు రూపొందించి వినూత్న పథకాలు ప్రవేశపెడుతు ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా ఒక బలమైన దేశంగా నిలబడిందన్నారు.

- Advertisement -

భారత దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం సింహభాగంగ నిలబడుతూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తుందన్నారు. ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రమైన తెలంగాణలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణ మాఫీ, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతో పాటు రైతు పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ సబ్సిడీ పై మొక్కలు ఇవ్వడంతో పాటు కాపు వచ్చే వరకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలో గృహవసరాలతో పాటు వ్యవసాయ, పరిశ్రమ, వ్యాపార రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడంతో పాటు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం, సొంత స్థలం ఉన్న వాళ్లకు గృహలక్ష్మి పథకం ద్వారా విడతల వారీగా ఒక్కో ఇంటికి 3 లక్షల రూపాయలు ఉచితముగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వనపర్తి జిల్లాలో పేరుగాంచిన రాజాగారి ప్యాలెస్ ప్రస్తుత పాలిటెక్నిక్ కళాశాల బాలికల, బాలుర వసతి గృహాల నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా బిటి రోడ్లు, వంతెనలు ఏర్పాటు చేస్తామన్నారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో 64.05 కోట్ల నిధులతో 1874 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. హరిత హారం ద్వారా మొక్కలు నాటి అటవీ శాతాన్ని గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 21.91 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు 9.16 లక్షల మొక్కలు నాటామన్నారు. షెడ్యూల్డు కులాల అభివృద్ధికి ప్రిమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వడం తో పాటు 2023-24 సంవత్సరంలో 9 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పించామన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఒక్కొక్కరికి 2.50 లక్షల రూపాయల చొప్పున లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు. దళిత బందు ద్వారా మొదటి విడతలో 199 యూనిట్లు 19.70 కోట్లతో గ్రౌండింగ్ చేశామన్నారు.

జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇటీవలే జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపించామన్నారు. పోలీస్ శాఖ ద్వారా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కేసులు సత్వర పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, ప్రజలు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి, జడ్పి చైర్మన్ అర్. లోక్ నాథ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News