Thursday, September 19, 2024
HomeతెలంగాణPaleru: భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరం

Paleru: భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరం

భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించడం అద్భుతం

ప్రభుత్వం సరఫరా చేసే మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరమని, శుద్ధి చేసిన నాణ్యమైన నదీ జలాలను ప్రభుత్వం ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా చేస్తుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూసుమంచి మండలం జీళ్ళచెరువు మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ళ పండుగ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 34 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల అన్ని ఆవాసాలకు శుద్ధమైన త్రాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో 900 వాటర్ ట్యాoకులు ఉండేవని, 3 సంవత్సరాలలోనే 300 కొత్త వాటర్ ట్యాoకులు నిర్మించుకున్నామన్నారు. ప్రతి మారుమూల ప్రాంతానికి సహా త్రాగునీరు రోజు సరఫరా అవుతుందన్నారు. గతంలో ప్రతి వేసవికాలం త్రాగునీటికి వేసవి కార్యాచరణ ప్రణాళిక చేసి, తాత్కాలిక నీటి సరఫరా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేదని, ఇప్పుడు త్రాగునీటికి ఏ సమస్యలు లేవని అన్నారు. గతంలో త్రాగునీటికి ధర్నాలు అయ్యేవని, ఇప్పుడు ఎక్కడా ధర్నాలు లేవని ఆయన తెలిపారు. గ్రామాల్లో గుట్టల మీద ట్యాoకులు కట్టి, అందులోకి నీరు నింపి, గ్రావిటీ ద్వారా ఇంటింటికి పంపిణీ అవుతున్నట్లు ఆయన అన్నారు. బోర్ వాటర్ సురక్షితం కాదని, నదుల నీరు మంచిదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి టర్మ్ లోనే త్రాగునీటి సమస్య తీర్చడానికి మిషన్ భగీరథ చేపట్టి, పూర్తి చేసిందని ఆయన అన్నారు. అంగన్వాడీలు, అన్ని బడులు, కెజిబివిలు, గురుకులాల్లో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఐడిఓసి లో మిషన్ భగీరథ నీటిని త్రాగుతున్నట్లు ఆయన తెలిపారు. నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఎన్నో దశల్లో శుద్ది చేసి, అన్ని పరీక్షల తర్వాత త్రాగునీటికి సరఫరా చేస్తారన్నారు. మిషన్ భగీరథ త్రాగునీరు వచ్చినప్పటి నుండి ఫుడ్ పాయిజన్, టైఫాయిడ్, కలరా లేవని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సందర్శించి, నీటి శుద్దిని స్వయంగా పరిశీలించి, ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, త్రాగడానికి గుక్కెడు నీటికోసం తపించిన తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించడం అద్భుతమని అన్నారు. మిషన్ భగీరథ పథకం ఒక అద్భుతమైన పథకమని, భావి భారత ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకమని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి మంచి నీరు, ఫ్లోరైడ్ రహిత నీరు అందించడానికి ముఖ్యమంత్రి ఆలోచించి మిషన్ భగీరథ పథకం తెచ్చారన్నారు. రాష్ట్రంలో 24500 గ్రామాలకు, 121 మునిసిపాలిటీలకు శుద్ధమైన త్రాగునీరు ఈ పథకం ద్వారా అందిస్తున్నారన్నారు.

- Advertisement -

వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లోని కొండల మీది కోయలకు మిషన్ భగీరథ నీరు అందుతున్నదని ఆయన తెలిపారు. గతంలో కావేడ్లు మోసెదని, బిందెలతో బోరింగ్ ల వద్ద కొట్లాటలు జరిగేవాని, ఇప్పుడు ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దే ట్యాప్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రజలు మిషన్ భగీరథ నీరు త్రాగేలా ప్రజాప్రతినిధులు చైతన్య పరచాలన్నారు. ప్రజలకు త్రాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని, బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిందని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, పాఠశాలల పిల్లలను గ్రిడ్ ల సందర్శన చేయించాలన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఇంటింటికి త్రాగునీరు అందిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేసవి కాలంలో గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తే ఖాళీ బిందెల ప్రదర్శనలు , నిరసనలు ఉండేవని, నేడు అటువంటిది ఎక్కడా లేదని అన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ సమయంలో చిన్న, చిన్న ఇబ్బందులు వస్తాయని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మంచి నీటి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. 2014 తో బేరీజు వేసుకుంటే రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సిసి రోడ్లు వేసేప్పుడు పైప్ లైన్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణీకరణ లో భాగంగా ఏర్పడుతున్న క్రొత్త హాబీటేషన్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. వారానికి ఒక పాఠశాల పిల్లలను గ్రిడ్ సందర్శన చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులను ఘనంగా సన్మానించారు.


జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు గ్రిడ్ ను సందర్శించి నీటి శుద్దీకరణ, సరఫరా ప్రక్రియను పరిశీలించారు. మిషన్ భగీరథ సిఇ కె. శ్రీనివాస్ వారికి నీటి శుద్ది ప్రక్రియ అంచెలను చూపిస్తూ, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, మిషన్ భగీరథ సిఇ కె. శ్రీనివాస్, పాలేరు నియోజకవర్గ మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, డిసిసిబి డైరెక్టర్, గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News