Saturday, November 23, 2024
HomeతెలంగాణParvathagiri: కాంగ్రెస్ మీద కసితోనే నేను టీడీపీలో చేరా

Parvathagiri: కాంగ్రెస్ మీద కసితోనే నేను టీడీపీలో చేరా

“మా నాయన నన్ను గొప్ప డాక్టర్ చేయాలనుకున్నాడు.. బాగా చదివించాలని పట్టుపట్టాడు. కానీ, నాకు పెద్దగా చదువు అబ్బలేదు. అయితే బాగా ఆటల్లో రాణించేవాడిని. పట్టుదలతో ఆడేవాడిని అన్ని ఆటల్లో గెలిచేవాడిని. ప్రతి ఆటలో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. ఆ టైంలో మా నాయన జగన్నాధ రావు పర్వతగిరి సర్పంచిగా ఉన్నారు. సమితి ప్రెసిడెంట్గా పోటీ చేశారు. టాస్ వేసి మా నాయనను కాంగ్రెస్ వారు ఓడించారు. అలా రెండు సందర్భాల్లో మా నాయనపై కాంగ్రెస్ కక్ష కట్టింది. కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న ఆ కసితోనే నేను టిడిపిలో చేరా. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ఓడించా. ఆ విధంగా పట్టుదలతో పని చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నేర్చుకున్న. అదే పట్టుదలతో ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నా. ప్రజల ఆశీర్వాదంతో నిరంతరం గెలుస్తున్నా. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి తర్వాత ఏ ఎన్నికల్లో ఓడిపోకుండా అన్ని ఎన్నికలు గెలుస్తున్నా. ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచా. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం, మంచితనంతో పనిచేస్తే ఓటమిలేనే లేదు. అందుకే నిరంతరం గెలవాలంటే పట్టుదల కావాలి. గెలవాలని కసి ఉండాలి గెలుపు కోసం పరితపించాలి గెలిచే వరకు విశ్రమించవద్దు. అప్పుడు గెలుపు ఎప్పుడు మనతోనే ఉంటుంది” అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్భవించారు.

- Advertisement -

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987-88 ఏడాది బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను చదివిన ఆ స్కూల్లో జరిగిన ఆ సమ్మేళనంలో మంత్రి ఉద్వేగంగా మాట్లాడారు. తన మనసులో మాటని బయటపెట్టారు. తన గెలుపు రహస్యాన్ని ప్రజలకు విప్పి చెప్పారు. అంతేకాకుండా ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే పార్వతగిరిలో ఉన్నత చదువులకు అవసరమైన విద్యాసంస్థలను నెలకొల్పుతామని మాట ఇచ్చారు. ఒకవైపు ఉద్వేగంగా తన మనసులో మాట చెబుతూనే… మరోవైపు తనదైన శైలిలో పచ్చి గ్రామీణ భాషలో చిన్న పిల్లగాడి మనస్తత్వంతో వెనుకటి రోజుల్లోకి వెళ్లి గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పూర్వ విద్యార్థులతో ముచ్చటించి మంత్రి మరోసారి ఆ పాఠశాల విద్యార్థి దశలోకి వెళ్లి పోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News