తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిని యువతి తండ్రి హతమార్చిన ఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సదయ్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకుడిపై అతడు ఒక్కడే దాడికి పాల్పడ్డాడా లేదా ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.
కాగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడుమండలం ముప్పిరితోట గ్రామంలో తన కూతురిని ప్రేమించాడని ఓ యువకుడిని, యువతి తండ్రి గొడ్డలితో అతి కిరాతకంగా హతమార్చిన విషయం విధితమే. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న డీఎస్పీ, సిబ్బంది అక్కడ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం నిందితుడిని ఆచూకీ కనిపెట్టేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపులో భాగంగా చీమలపేట వద్ద యువతి తండ్రిని అరెస్ట్ చేశారు.