Saturday, May 18, 2024
HomeతెలంగాణPenkutillu: బాల్యపు స్మృతుల తడి 'పెంకుటిల్లు'

Penkutillu: బాల్యపు స్మృతుల తడి ‘పెంకుటిల్లు’

బలిచేయకండి బతకండి, బ్రతికించండి బ్రతికి సాధించండి

‘ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం’ అంటాడు మహాకవి. పద్మవ్యూహం లాంటి ప్రపంచంలో మనిషి నిత్యం ఎన్నో రకాల సంఘర్షణలు ఎదుర్కొంటూ సుఖమయ జీవితం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎంత సుఖంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నా ఏదో విషయంలో సంఘర్షణ చెందుతూనే ఉంటాడు. ఈ సంఘర్షణ నిత్యం ఉంటూనే ఉంటుంది. మనిషి జీవితమే నిత్య సంఘర్షణ. ఇక కవి హృదయం నిరంతరం ఏదో సమస్యతో సంఘర్షిస్తూనే ఉంటుంది. అటువంటి సంఘర్షణకులోనై తనకు తన స్పందనల ద్వారా బయట ప్రపంచానికి తన భావాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ మధ్యకాలంలో నేను చదివిన కవిత్వం ‘పెంకుటిల్లు’. డా॥ కాంచనపల్లి గోవర్ధన రాజు అనేక సంఘర్షణలను మౌళికాంశాలుగా తీసుకొని ప్రత్యేకంగా మలచిన విధానం బాగుంది.
మిమ్మల్ని చూస్తే
కిరీటం పైన చెక్కిన
నెమలి పింఛంలా
విచ్చుకోవలసిన మేం
పెంకుటింటి పుట్టమన్ను
అలుకు పైన తేనెలు తీసిన గోడలు
కలలో కొచ్చినప్పటి
పులకరింతలం కావలసిన మేం,
చీకటి అర్ర తెరసు చీల్చి
ఇరవది వసంతాలైనా
గడవని మీ ఊపిరి
ఇట్లా ఆగిపోతే ఎట్లా?
‘బ్రతికి సాధించండి..’ శీర్షికతో ఉన్న ఈ కవిత 2021 సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాలను ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సుమారు రెండు డజన్ల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం ప్రస్తావనార్హం. ఈ కవితను చదివితే అలిశెట్టి ప్రభాకర్‌ గారి ‘ఈతరం క్రీస్తు’ కవితలోని ‘బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి శిలువేసి సంవత్సరముల మేకులు దిగేసి విద్యావ్యాపార వ్యవస్థలో నెత్తురాడుతూ ఇంకెందరు నిరుద్యోగ క్రీస్తులో‘ అన్న వాక్యాలు గుర్తుకు వస్తున్నవి. అలాగే గుంటూరు శేషేంద్రశర్మ గారి ‘మీరు వలకా పుస్తకాలు పట్టుకొని పోతుంటే బాబు మీరు సిలువను మోసుకుపోతున్న బాల క్రైస్తవుల్లా కనిపిస్తారు‘ (నా దేశం నా ప్రజలు) అన్న వాక్యాలు కూడా గుర్తుకు వచ్చినవి. ముగింపుగా ఈ కవితలో ఇలా… మొతక ప్రయాణాన్ని ఎడారి మృగానికి బలిచేయకండి బతకండి, బ్రతికించండి బ్రతికి సాధించండి అంటూ ముగించటం విద్యార్థుల అత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించేదిగా వ్రాయటం గొప్ప విషయం.
శెట్టర్లు పాలషాపులు
బద్దకంగా కళ్ళు తెరుస్తుంటాయి
దేశం తెల్లకాగితమై
డోరు ముందు వాలుతుంది
అద్దం ముందుకు వెడతావా
ప్రియురాలి మగత కంటిలో వెలుగై
పద్యం కదలుతుంటుంది
ప్లాస్టిక్‌ చిలక తలమీద నొక్కుతామో లేదో
ప్రపంచపుటద్దపు తెర
కమలను మనసును క్రమ్ముకుంటుంది
‘వెలుగు మొగ్గ విరుస్తుంటే శీర్షికతో ఉన్న పై కవిత వార్తాపత్రికలను ఉద్దేశించి వ్రాసినట్లుగా అనిపిస్తుంది. దేశం తెల్లకాగితమై లేవకముందే ప్రపంచపు వార్తా విశేషాలన్నీ మోసుకొని గుమ్మం ముందు వాలి వుంటుంది. అనేక రకాల సృజనలను ప్రోదిచేసుకొని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఒక అనుభవం మరొక అనుభవానికి పీఠికవుతుంది అంటూ జీవిత అనుభవసారాన్ని తెలిపారు ఇందులో.
దూడలను ఇంగ్లీషు
మీడియం ప్రైవేట్‌ కబేళాలకు
బలవంతంగా తరలిస్తున్నప్పుడు
ఆవు తల్లి లాంటి
ఆ పెద్దబడి
ఎంత దుఃఖాగ్ని ప్రవేశం చేస్తుందో
ఐదు వసంతాల
తన ఒడిలో ఆ పెద్దబడి
ఎన్ని లేత చెట్లకు
కొత్త చిగురు లద్దిందో
డొల్లు వాగ్దాన ప్రగల్భాలతో
పాపం పెద్దబడి విద్యాదేవత నిట్టూర్చయి
వెలవెల బోతోంది
‘పెద్దబడి’ శీర్షికతో వున్న ఈ కవితను చదవగానే నేను చదివిన మా పూరి పెద్దబడి/ హైస్కూల్‌ గుర్తుకువచ్చింది. లీజర్‌ పీరియడ్లో వేపచెట్ల నీడన అదుకున్న దృశ్యాలు బౌండు మల్లెపూలు ఏరి సహచర విద్యార్థులకు ఇచ్చిన సన్నివేశాలు, సెలపు రోజులలో కోతికొమ్మచ్చి, క్రికెట్‌, కబడ్డి, వాలీబాల్‌, దొంగ పోలీస్‌ మొదలైన ఆటలన్ని పెద్ద బడి ఆటస్థలంలో అదుకునేవాళ్ళం బాల్యదశలో, విద్యార్ధులు ప్రయివేటు పాఠశాలకు వెళ్ళడంతో మూతపడే స్థితికి వచ్చింది. ఊర్లో గతంలో పెద్దబడిలో చదివిన విద్యార్థులు, అధికారులు తల్లిదండులను ఒప్పించటంతో మళ్ళీ తిరిగి నిలదొక్కుకుంది. ఇలాంటి పరిస్థితులు చాలాచోట్ల ఊర్లలో చూస్తూనే ఉన్నాం. కార్పోరేట్‌ రాబందుల రెక్కలకు ప్రభుత్వ విద్యావ్యవస్థ బలిపీఠం మీద నిలబడింది. పెద్దబడి జ్ఞాపకాలు ఎవరిని కదిలించినా తెరలు తెరలుగా కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు. ఇందులో కూడా చక్కని జ్ఞాపకాలు పొందుపర్చారు. అలాగే పెద్దబడి శిథిల స్థితిని కూడా కళ్ళకు కట్టారు పై కవితలో.
‘ప్రతి ఎండాకాలంలో నాన్న చేతులు
ఆప్యాయంగా దీని గోడల జ్ఞాపకాలను నిమిరేవి
అమ్మ దీనికి పన్నం పట్టెల
తీనెలు దిద్దేది
ఎర్రమట్టినంతా ఒంటికి రాసుకున్న అరుగు
నాన్న బతికున్నప్పటి అమ్మలా ఉండేది
ఎండాకాలం హూంకరించినపుడు
చలికత్తి శరీరాలను నిర్దాక్షిణ్యంగా కోసేసినపుడు
ఈ పెంకుటిల్లు ఒక తల్లికోడై
తన రెక్కల్లో మమ్మల్ని దాచుకునేది‘
’పెంకుటిల్లు’ శీర్షికతో ఉన్న ఈ కవితను చదవగానే 1980 దశకంలోని ఆనాటి గ్రామీణ ప్రాంతాలలోని పెంకుటిల్లు, డాబా ఇల్లు, చల్లని పూరిగుడిసెలు కళ్ళముందు కదలాడినవి. రచయితకు ఈ పెంకుటిల్లుతో ఉన్న జ్ఞాపకాలు ఈరకంగా యాది చేసుకోవడం కొత్తేమీ కాకపోయినా ప్రతి వ్యక్తి ఇంటితోటి, ఇంటి పరిసరాలతోటే ఎనో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. మట్టిగోడలు వాటికి పండ గల సందర్భాలలో ఎర్రమన్నుతో అలికి తెల్లసున్నం గీతలు నిలువునా గీసి ఇంటివి ఇంటిపరిసరాలని అందంగా అలం కరించేది అమ్మ, నాన్న పోయిన తర్వాత ఆ ఇంటిని, ఇంటి పరిసరాలను, ఆ పరిసరాలలో పెరుగుతున్న మొక్కలు ఆ ఇంట్లో పెద్ద మనిషి లేని లోటును తెలియజేస్తున్నాయ్‌ అంటారు. ఎర్రమట్టినంతా ఒంటికి రాసుకున్న అరుగు నాన్న బ్రతికున్నప్పటి అమ్మలా ఉండేది‘ అంటాడు. అమ్మ మొఖం నాన్న బ్రతికున్నప్పుడు కళకళలాడేది. నాన్న పోయాక కళ తప్పింది అంటూ ఆర్తిగా చెప్పడం బాధించే అంశమే. ‘ఎప్పుడూ తనమీదనే కూర్చునే కుర్చీ ఇప్పుడు కాళ్ళు విరిగి బిక్కచచ్చి మూలపడిపోయింది‘ అంటూ ఆ నిషాద జ్ఞాపకాలు ’పెంకుటిల్లు’ రూపంలో తల్చుకొని మనల్ని కూడా నిషాదంలోకి నెట్టి, ఓ వైపు బాల్యపు జ్ఞాపకాలు, మరోవైపు విషాదపు ఛాయలు కళ్ళముందు మెదిలేలా ఈ కవిత ఉద్వేగభరితంగా సాగుతుంది.
ఇక ఈ కవితా సంపుటిని చదువుతున్నంతసేపు పల్లె టూరి జ్ఞాపకాలు, బాల్యం, బాల్యస్మృతులు ఇలా ఒకటేమిటి, అన్నిరకాల భావోద్వేగాల సమాహారం బాల్యమే కదా. నాకు కూడా అన్నీ కళ్ళముందు కదిలినయ్‌. గోవర్ధన రాజు గారు కూడా పల్లెటూరి వాతావరణంలో పెరగటం ఆ వాతావరణం తాలూకు జ్ఞాపకాల తడిని ఇందులో పొందుపరిచి మనల్ని కూడా అందులో తడిసేలా కవిత్వీకరించారు. ఒక కవిత అని ప్రత్యేకంగా చెప్పలేము. ’కుదురు’, ’నాన్నా నేను వెళ్ళక తప్పదు’. ‘ఇంటికాపు’, ‘ఇల్లు ఖాళీ చేస్తుంటే’, ‘గుండె పలుకులు’ మొదలైన కవితలన్నీ బాల్యపు జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేసేవే. ఇంకా దీనిని చదివితే కాంచనపల్లి గోవర్ధనరాజు గారికి ప్రముఖ కవి, రచయిత ఏనుగు నర్సింహా రెడ్డి గారు రూమ్మేట్‌ అని, కవి యాకూబ్‌ జూనియర్‌ విద్యార్థి అని, అలాగే మద్దూరి నగేష్బాబు హాస్టల్మెట్‌ అని ఇలా చాలా జ్ఞాపకాలు ఇందులో పొందుపర్చి మనల్ని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయపు జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లారు. ఏది ఏమైనా ‘పెంకుటిల్లు’ జ్ఞాపకాల కలబోత బాల్యపుస్మృతుల ‘తడి’ అని చెప్పొచ్చు. దీనిని తన మిత్రుడు జూలూరి గౌరీశంకర్‌ కి అంకితం ఇచ్చి సహృదయతను చాటు కోవడం మరొక విశేషం.
-డా॥ మహ్మద్‌ హసన్‌
సాహిత్య విమర్శకులు
9908059234

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News