తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. కేసు దర్యాప్తు అధికారులకు చిక్కుముడి ఎదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డ్ లభించింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబ సభ్యుల ద్వారా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది.
Also Read : ‘రేవంత్ సీఎం అయితే కేటీఆర్ యాక్టింగ్ సీఎం’
ప్రస్తుతం ప్రభాకర్ రావుకి గ్రీన్ కార్డు రావడంపై ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు లభిస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. దీంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు ఎల్ఓసి (లుక్ అవుట్ సర్క్యులర్) జారీ చేశారు. రెడ్ కలర్ నోటీస్ కూడా జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డుతో ఎంతకాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఆయన హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.