Sunday, November 16, 2025
HomeతెలంగాణPMSBY : ఉపాధి కూలీలకు అండ.. రూ.20ల బీమాతో రూ.2 లక్షల భరోసా!

PMSBY : ఉపాధి కూలీలకు అండ.. రూ.20ల బీమాతో రూ.2 లక్షల భరోసా!

PMSBY for NREGA workers : పల్లె బతుకులకు ఆసరాగా నిలుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) కూలీలకు కేంద్ర ప్రభుత్వం మరో భరోసా కల్పించింది. పని ప్రదేశంలో అనుకోని ప్రమాదం జరిగితే, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాన్ని వారికి వర్తింపజేసింది. కేవలం రూ.20ల నామమాత్రపు ప్రీమియంతో, రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చని మీకు తెలుసా..? ఈ పథకంపై చాలామంది కూలీలకు అవగాహన లేకపోవడం గమనార్హం. అసలు ఏమిటీ పథకం..? దీనికి అర్హులెవరు..?

- Advertisement -

ఉపాధి హామీ పనుల వద్ద ప్రమాదం జరిగితే, నిబంధనల ప్రకారం ఇచ్చే పరిహారం బాధితుల కుటుంబాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వారికి అదనపు భరోసా కల్పించేందుకు, PMSBY పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏమిటీ ‘PMSBY’ పథకం : ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకం.
అర్హులు: 18 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న, బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా ఉన్న ఉపాధి హామీ కూలీలందరూ ఈ పథకానికి అర్హులు.
ప్రీమియం: ఏడాదికి కేవలం రూ.20 చెల్లించి ఈ పథకంలో నమోదు చేసుకోవాలి. ఈ మొత్తం నేరుగా వారి ఖాతా నుంచే డెబిట్ అవుతుంది.
పరిహారం: పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు కూలీ మరణించినా, లేదా శాశ్వత వైకల్యం సంభవించినా, వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందుతాయి. పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది.

అవగాహన కల్పించడంలో విఫలం : అత్యంత ప్రయోజనకరమైన ఈ పథకంపై క్షేత్రస్థాయిలో కూలీలకు సరైన అవగాహన లేకపోవడం విచారకరం. ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు కూడా దీనిపై పెద్దగా ప్రచారం చేయడం లేదన్న విమర్శలున్నాయి. కరీంనగర్ జిల్లాలో 1.99 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదై ఉన్నా, చాలా తక్కువ మంది మాత్రమే ఈ బీమా పథకంలో చేరారు. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని, ప్రతి కూలీకి ఈ బీమా భరోసా అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

కరీంనగర్ జిల్లా గణాంకాలు
ఉపాధి హామీ కార్డులు: 98,036
నమోదైన సభ్యులు: 1,99,728
యాక్టివ్ సభ్యులు: 93,353
ఈ పథకం, ప్రమాదవశాత్తు జీవనాధారం కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలవనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad