Ponguleti Srinivas Reddy| తనపై ఈడీ విచారణ జరగకుండా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కాళ్లు పట్టుకున్నానంటూ మాజీ మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కౌంటర్ ఇచ్చారు. గతంలో తాను బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరే ముందు ఒకే ఒక్కసారి వేలాది ప్రజల ముందు తండ్రితో సమానులు అని భావించి కేసీఆర్ (KCR) కాళ్లు పట్టుకున్నానని గుర్తుచేశారు. అలా కాళ్లు పట్టుకుంటే మీరు, మీ నాన్న, మీ కుటుంబం తనతో పాటు లక్షలాది మంది కార్యకర్తలను తడి గుడ్డతో గొంతు కోశారని ఫైర్ అయ్యారు. అందుకే మీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో కేటీఆర్ గుర్తు తెచ్చుకోవాలన్నారు.
దీపావళి పండుగకు పటాసులు పేలుతాయని తాను చెబితే.. గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్న చందంగా కేటీఆర్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు కేటీఆర్ భయపడుతున్నారని ఎద్దేశా చేశారు. పేదల సొమ్మును దోచుకున్నందుకే అరెస్ట్ చేస్తున్నారని ఉలిక్కి పడుతున్నారంటూ విమర్శించారు. దేశచరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 27 రోజుల్లో రూ.18వేల కోట్లను రైతులకు రుణమాఫీ చేశామన్నారు. రైతు రుణమాఫీని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని తెలిపారు. తల తాకట్టు పెట్టైనా ఈ డిసెంబర్ నెల లోపే మిగతా రూ.13వేల కోట్ల రుణాలను మాఫీ చేయబోతున్నామని స్పష్టం చేశారు.