Wednesday, November 13, 2024
HomeతెలంగాణRevanth Reddy | సొంత జిల్లా నిరుద్యోగులకే జాబ్స్ ప్రయారిటీ

Revanth Reddy | సొంత జిల్లా నిరుద్యోగులకే జాబ్స్ ప్రయారిటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ పండితులు ఆయనకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ పార్టీ ఇతర నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ గోపురం వద్ద శ్రీకురుమూర్తి స్వామి దేవస్థానానికి రోడ్డు మార్గం ఏర్పాటుకు 3.7 కి.మీలు ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్, దేవస్థాన ఇతర అభివృద్ధి పనులకు 110 కోట్లు నిధులతో మంజూరు చేసిన పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

- Advertisement -

అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ… జిల్లాలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తామని, త్వరలోనే మక్తల్, కొడంగల్, నారాయణ పేటకు కృష్ణా జలాలు పారుతాయని ప్రకటించారు. నిరుపేద ప్రజలు ఎవరైతే తిరుమల తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోలేరో అలాంటి వారు దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానానికి వెళ్లి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారని తెలిపారు. అలాంటి మహత్తర ప్రత్యేకత కలిగిన దేవాలయానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు దర్శించుకోలేకపోతున్నారని స్థానిక శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి చెప్పడంతో వెంటనే 110 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

Also Read : బీసీల ఓట్ల కోసమే కులగణన..

ఎవరు అడ్డుపడినా అభివృద్ధి చేస్తా…

తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ నుండి ప్రాతినిధ్యం వహించగా ఇన్ని సంవత్సరాల తర్వాత పాలమూరు బిడ్డ అయిన తనకు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం వచ్చిందని అందువల్ల ఎవరు అడ్డుపడినా ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

2009 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పాలమూరు నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా జిల్లా ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు అభివృద్ధికి ఏమి చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అప్పుడు వారి సొంత జిల్లాను అభివృద్ధి చేసుకుంటే మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు నాకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి స్వంత జిల్లాను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తే లేనిపోని ఆరోపణలు చేసి అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని, తాను మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతానని సీఎం తేల్చి చెప్పారు.

జిల్లా నిరుద్యోగులకు ప్రయారిటీ…

మహబూబ్ నగర్ జిల్లాలోని నిరుద్యోగులకు మాత్రమే అమర్ రాజా బ్యాటరీ సంస్థలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని సంస్థతో మాట్లాడటం జరిగిందని, వారు అందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో వచ్చే పరిశ్రమలు ఇక్కడి నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లాలోని ప్రధాన దేవాలయాలు మన్యంకొండ, కురుమూర్తి దేవస్థానం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు దేవాదాయ శాఖ వారితో చర్చించి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి తాండాకు బిటి రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాల్సిందిగా వేదిక నుండి కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News