HSRP Old Vehicles RTA: పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వేయించుకోవాలని ఇటీవల తెలంగాణ ఆర్టీఏ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. అయితే వీటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా అధికారులు స్పందించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/tgpsc-group-2-results-2024-merit-list-announced/
రాష్ట్రంలోని పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు కచ్చితంగా మార్చుకోవాలని అధికారులు తెలిపారు. అయితే నిర్దేశిత గడువులోగా(సెప్టెంబర్ 30) మార్చుకోవాలని లేదంటే.. ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని గతకొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అధికారులు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ సమాచారం రాష్ట్ర ఆర్టీఏ అధికారుల దృష్టికి చేరడంతో దీనిపై స్పందించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని.. పాత వాహనాలకు కొత్త హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించేందుకు తాము ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు.
పాత వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ బిగించాలనే అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం చర్చించి.. తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. నంబర్ ప్లేట్ల మార్చుకోకపోతే జరిమానలు విధిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.


