తెలంగాణ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర గిరిజన,స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. బాధితుల పునరావాసం కొరకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బేగంపేటలోని ఎకనామిక్ సోషల్ స్టడీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన మానవ అక్రమ రవాణా నివారణ ఒక్కరోజు వర్క్ షాప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు, పిల్లల అక్రమ రవాణాను ఎదుర్కోవడం, బాధితులకు సంరక్షణ, భద్రత, పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో, వారి హక్కులను గౌరవిస్తూ, వారికి సహకరించే విధంగా చట్టపరమైన, ఆర్థిక, సామాజిక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు నేరస్థులపై విచారణ జరిగేలా చూడటం వంటి అంశాలపై ఈ వర్క్ షాప్ కొనసాగిందని మంత్రి తెలిపారు. మానవ అక్రమ రవాణా రవాణా జరగటం దురదృష్టకరం అని, ఒక తల్లిగా ఆ చిన్నారులను చూస్తే మనస్సు తరుక్కుపోతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని మానవ అక్రమ ఆహ్వానకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మానవ అక్రమ రవాణా అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల తీసుకుంటుందన్నారు. మానవ అక్రమ రవాణా నివారణ కోసం ప్రత్యేకించి లేబర్ డిపార్ట్మెంట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లు, చైల్డ్ లైన్లు, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్ ను అందించాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం అని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ భారతి హోళీ కేరి, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ బృందాధర్ రావు, బాలలహక్కుల కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు, లేబర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్యాంసుందర్, అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్, డీఎల్ఎస్ఏ మెంబర్స్, సిడబ్ల్యూసి చైర్మన్ మెంబర్స్, ఏహెచ్టియూ ఆఫీసర్స్, లేబర్ ఆఫీసర్స్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.