రాష్ట్రంలో మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి స్వార్థ రాజకీయాలు చేసే సికింద్రాబాద్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి గంగాపురం కిషన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, వర్కింగ్ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న ) లు శపథం చేశారు.. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదం సంతోష్ కుమార్ ను మాల సంఘాల జేఏసీ నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని దానం నాగేందర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు. అనంతరం సికింద్రాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చెరుకు రామచందర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న దానం నాగేందర్ కు మాల సంఘాలన్ని మద్దతు తెలిపి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా దళితులపైన, క్రైస్తవులపైన, ఆదివాసీలపైన జరిగిన అనేక దాడులను ఖండించారు. దేశంలోని ప్రజలందరికీ రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అనే ఆయుధంతో బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపు నిచ్చారు. మోదీ హయాంలో ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటికరించి అంబానీ, ఆదానిలకు కట్టబెట్టాలని చూస్తున్న విధానాన్ని ఆక్షేపించారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, విద్యారంగాన్ని భ్రష్టు పట్టించింది, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది, విద్యార్థులు, యువకులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. తమకు 400పైగా సీట్లను ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము, రాజ్యాంగ పీఠికలోని లౌకిక వాదం అనే పదాన్ని మారస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పురాతన కాలంలో ఏదైతే ఉందో సనాతన ధర్మం పేరిట పేద ప్రజలను ఊరి బయట ఉంచే సంస్కృతి వస్తుందని అవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా దళితుల మధ్య విభేదాలు సృష్టించి వారి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్న కిషన్ రెడ్డిని ఓడించడం కోసం కిషన్ రెడ్డి అంతం మాలల పంతం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. బేర బాలకిషన్ (బాలన్న) మాట్లాడుతూ సికింద్రాబాద్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కిషన్ రెడ్డి మాలల బద్ద శత్రువని తెలిపారు.
మాల మాదిగలు కలిసి ఉంటే తమ పప్పులుడకవని మా మిత్రుడు కృష్ణ మాదిగను తమ వెంట తిప్పుకుంటూ నాటకాలాడుతూ కిషన్ రెడ్డి మాలల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతిస్తున్నారని ఆరోపించారు. మాలల ఉనికే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కిషన్ రెడ్డి బినామీ డబ్బులన్ని మంద కృష్ణ మీద పెట్టి మాలల మీదకు ఎగదోస్తున్నారని చెప్పారు. మనువాదం వైపు వెళుతున్న బీజేపీకి అంటకాగుతు దళితుల మధ్య చిచ్చు పెట్టవద్దని మంద కృష్ణకు హితవు పలికారు. నీ స్వలాభం కోసం చేస్తున్న పనులు తెలుసుకుంటున్న మాదిగలు కూడా నీకు దురమౌతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు తాళ్లపల్లి రవి నాను, అనిల్ కుమార్, సత్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.