Monday, November 17, 2025
HomeతెలంగాణMinister seethakka: నా జోలికి వచ్చిన వారికి మంచి జరగదు: మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Minister seethakka: నా జోలికి వచ్చిన వారికి మంచి జరగదు: మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Sethakka:  ములుగు నియోజకవర్గంలో తాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని మంత్రి సీతక్క తీవ్రంగా ఆరోపించారు. కేటీఆర్ ప్రోద్బలంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

- Advertisement -

మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు తనను ఓడించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని, కానీ ములుగు ప్రజలు తనను నమ్మి గెలిపించారని, ఇప్పుడు తాను నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు.

అట్టడుగు వర్గాల బిడ్డలు నాయకత్వంలోకి రావడం దొరలకు సహించలేకపోతున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో, దురాశతో తనలాంటి అట్టడుగు వర్గాల బిడ్డను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పక్క నియోజకవర్గాల నుంచి నాయకులను రప్పించి ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

“నాపై తప్పుడు ఆరోపణలు చేసినవారు ఎవరూ బాగుపడలేదు” అని సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాపై నిందలు వేస్తే మీ బిడ్డ జైలుకు వెళ్లింది. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి వస్తే ఆ తల్లి సమ్మక్క దయతో రాజకీయంగా సర్వనాశనం అవుతారు” అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‌పై తన సొంత చెల్లెలే బాధపడుతోందని గుర్తుచేస్తూ, “సొంత చెల్లి ఫోన్‌ను ట్యాప్ చేసిన నీకు నీతి ఉందా? సొంత చెల్లిని వేధించిన కేటీఆర్‌కు ఆదివాసి అటవీబిడ్డ ఒక లెక్కనా?” అని ప్రశ్నించారు. అందుకే తనపై దొంగ లేఖలు రాయిస్తూ, తన ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. “సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వాడివి, ఆడకూతురుతో నీకెందుకు? నాశనం అయిపోతావు. చావులపై రాజకీయాలు చేయడమే బీఆర్ఎస్ పని” అని విమర్శించారు.

బీఆర్ఎస్ తీరుపై సీతక్క తీవ్ర విమర్శలు:

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి పేదలను చావులకు బలి చేశారని, కానీ వారంతా దర్జాగా బతికారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో అదే చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారు” అని అన్నారు. బీఆర్ఎస్ ప్రేరేపించడం వల్లే గతంలో నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్ళు ఇవ్వలేదని, తాము ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

అన్ని నియోజకవర్గాల్లో 3500 ఇళ్ళు ఇస్తే, తన నియోజకవర్గంలో 5 వేల ఇళ్లను మంజూరు చేయించానని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు దర్జాగా ఇళ్ళు నిర్మించుకున్నారని, కానీ పేదలకు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు.
రైతుల సమస్యలపై సీతక్క స్పందన
తమ ప్రభుత్వంలో విత్తన కంపెనీల మెడలు వంచి రూ. ఐదు కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తున్నామని సీతక్క తెలిపారు. “రైతులను ఆదుకునే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు. మాలాంటి బిడ్డలు ఎదగొద్దు అని దొరలు కుట్రలు పన్నుతున్నారు. దొరల కుట్రలను తిప్పి కొడతాం” అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి సీతక్క ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad