Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేంద్ర హోంసహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఆయనను జూలై 24వ తేదీన విచారణ కోసం హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు హాజరయ్యేలా కోరారు. ఈ సందర్భంగా ఆయన నుంచి వివరణాత్మక వాంగ్మూలాన్ని తీసుకునే అవకాశం ఉంది.
కేసు నేపథ్యం
తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేసిందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. ఈ ఆరోపణలపై కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోతుగా ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే?
ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొన్ని మీడియా ప్రతినిధులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అని భావించిన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే మాజీ పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన మాజీ ప్రతినిధులు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పని చేసిన కొందరు ఐపిఎస్ అధికారులు విచారణకు హాజరయ్యారు. బీజేపీకి చెందిన మరికొందరు నేతలు కూడా సమన్లు అందుకున్నట్లు సమాచారం.
బండి సంజయ్ పాత్ర ఏమిటి?
బండి సంజయ్ పేరు ఈ విచారణలో ట్యాపింగ్ బాధితుడిగా లేదా సమాచారం కలిగిన వ్యక్తిగా ఉందా అనే విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియకపోయినా.. ఆయనను సాక్షిగా పిలవడం, కేసులో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. తన ఫోన్ సంభాషణలు ట్యాప్ అయినట్లు ఆయన గతంలో కొన్ని సందర్భాల్లో ఆరోపించారు కూడా. ఈ పరిణామాలపై బీజేపీ వర్గాలు స్పందిస్తూ, ఇది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాడుల రాజకీయానికి ఉదాహరణ అని విమర్శిస్తున్నాయి. మరోవైపు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం “సత్యం వెలుగులోకి రావాల్సిందే” అంటూ SIT పని తీరును సమర్థిస్తోంది.


