Sunday, October 6, 2024
HomeతెలంగాణSrinivas Goud: కృష్ణానది వరదను పరిశీలించిన మంత్రి

Srinivas Goud: కృష్ణానది వరదను పరిశీలించిన మంత్రి

వరద ఉధృతి తగ్గేవరకు కర్ణాటక దత్త పీఠానికి బోట్ ప్రయాణం ఆపండి

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసువుల వద్ద మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి కృష్ణానది వరద దృశ్యం పరిశీలించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు…

- Advertisement -

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్:

ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని వదిలిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచిస్తున్నాం. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం సుమారు 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద పరిస్థితిపై కర్ణాటకలోని బీజాపూర్ కలెక్టర్ తో నారాయణపేట కలెక్టర్ నిరంతరం మాట్లాడుతున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు కర్ణాటక దత్త పీఠానికి బోట్ ప్రయాణం ఆపాలని అధికారులకు ఆదేశించాం. గతంలో పడవ మునిగి నలుగురు మృతి చెందిన ఘటన ఇప్పటికీ ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తున్నది.

భవిష్యత్తులో పడవ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు స్థానిక బోట్ నిర్వాహకులకు నాగార్జునసాగర్ లో శిక్షణ ఇప్పిస్తాం. కృష్ణానది వరద ఉధృతిపై అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. కృష్ణ నది పరివాహక గ్రామాల వద్ద ప్రజలు ఎవరు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పసుపుల నుంచి దత్తపీఠం వెళ్లే భక్తులు తప్పనిసరిగా వరద ఉధృతి తగ్గేవరకు నదిలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. నారాయణపేట జిల్లా రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. నది తీర ప్రాంతం వద్ద ప్రజలు మదిలోకి వెళ్లకుండా నిరంతరం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలి.

రాష్ట్రవ్యాప్తంగా వరదల పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కురువపురం దత్తపీఠం దేవికి చేరుకునేందుకు త్వరలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పెద్ద బోట్లను ఏర్పాటు చేస్తాం. పసుపుల నుంచి దత్తపీఠం వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టి భక్తులు సులభంగా దత్త పీఠం దేవాలయం చేరుకునేందుకు కృషి చేస్తాం. టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా పసుపుల వద్ద 5 ఎకరాల్లో హరిత హోటల్ కన్వెన్షన్ సెంటర్, బోటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పి సత్యనారాయణ తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో శ్రీధర్, స్థానిక సర్పంచ్ దత్తు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News