TDP-BJP: తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకుడే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. ఇదీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి వినిపించే మాటలు. ఒకరకంగా అందులో నిజం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకుడే లేడు. క్యాడర్ కూడా వలసపోయింది. అయితే.. కార్యకర్తలు, అభిమానులకు మాత్రం కొదువేలేదు. ఇప్పుడు వాళ్ళని తట్టిలేపి తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు చంద్రబాబు.
తాజాగా ఖమ్మంలో చంద్రబాబు నిర్వహించిన సభతో ఒక్కసారిగా అందరి దృష్టీ టీడీపీపై పడేలా చేసింది. 8 ఏళ్ల తరువాత తెలంగాణలో చంద్రబాబు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. వెయ్యి కార్లతో చంద్రబాబు ర్యాలీ వెళ్తుంటే తెలంగాణ మొత్తం చూసింది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తే.. చంద్రబాబుకు ఇంకా ఈ రేంజ్‌లో ఆదరణ ఉందా అని పార్టీ అయోమయంతో చూశాయి. అయితే.. సభ సక్సెస్ అయినంత మాత్రాన.. భారీగా జనాదరణ కనిపించినంత మాత్రాన టీడీపీకి మళ్ళీ పూర్వవైభవం అని ఊహించుకుంటే అది పిచ్చితనమే అవుతుంది.
ఎందుకంటే అభిమానం వేరు.. ఓటు వేరు. సభలు వేరు.. ఎన్నికలు వేరు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియనివేమీ కాదు. అందుకే తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే పొత్తులు కావాల్సిందే. మరోవైపు తెలంగాణలో బీజేపీది అలాంటి పరిస్థితే. బీఆర్ఎస్ పార్టీలో అయోమయం.. కాంగ్రెస్ కుమ్ములాటలు కలిసి బీజేపీకి మంచి స్కోప్ దొరికింది రాష్ట్రంలో. అయితే ఇది ఏకంగా అధికారం తెచ్చే స్థాయిలో లేదన్నది బీజేపీకి తెలుసు. అందుకే ఆ స్కోప్ మరింత పెంచేలా పొత్తుకు వెళ్తే ఎలా ఉంటుందన్నది కొన్నాళ్ళుగా జరుగుతున్న చర్చ.
అయితే.. మనుగడలేని టీడీపీతో పొత్తా అని పార్టీలో చాలామంది నిర్లక్ష్యం చేశారు. కానీ, తాజాగా టీడీపీ ఖమ్మం శంఖారావం సభతో చంద్రబాబు క్లారిటీ ఇచ్చేనట్లే భావించాలి. కాస్త అండగా ఉంటే.. టీడీపీ పుంజుకుంటే తమకి ఉపయోగం ఉంటుందా అనే ఆలోచనలు ఇప్పుడు బీజేపీలో మొదలవుతున్నాయి. గోడ చేర్పులాగా బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడైనా బీజేపీ అధిష్టానంలో కదలిక వస్తుందా? అనేది చూడాలి.